త్వరలో సౌతాఫ్రికాతో జరుగోయే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును నిన్న (నవంబర్ 5) ప్రకటించారు. ఊహించిన విధంగానే అన్ని ఎంపికలు జరిగాయి. కొత్త వారెవ్వరికీ అవకాశాలు దక్కలేదు. ఇంగ్లండ్ సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్ రీఎంట్రీ ఇచ్చాడు.
అదే సిరీస్‌లో ఆకట్టుకున్న ఆకాశ్‌దీప్ పునరాగమనం చేశాడు. యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి తమ స్థానాలు నిలబెట్టుకున్నారు.
కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. సీనియర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ కొనసాగారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి..?
ఈ జట్టు ప్రకటన తర్వాత భారత క్రికెట్ అభిమానుల్లో ఓ విషయంలో గందరగోళం మొదలైంది. అసలు టీమిండియాకు ఎంపిక కావాలంటే ఏం చేయాలి.. దీనికి ప్రామాణికం ఏంటని చాలా మంది చర్చించుకుంటున్నారు.
ఈ చర్చ ఉత్పన్నమవడానికి ఇటీవలికాలంలో భారత సెలెక్టర్లు అనుసరిస్తున్న విధానాలే కారణం. గతంలో భారత జట్టుకు ఎంపిక కావాలంటే దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాల్సి ఉండేది. అక్కడ అత్యుత్తమంగా రాణిస్తేనే భారత సెలక్టర్ల నుంచి పిలుపు దక్కేది. అయితే ప్రస్తుతం సీన్ మారిపోయింది.
పెద్ద తలకాయల అండదండలుంటే చాలా..?
భారత క్రికెట్‌కు సంబంధించి పెద్ద తలకాయల అండదండలుంటే ఎలాగైనా జట్టులోకి వచ్చేయవచ్చు. ఇందుకు హర్షిత్ రాణా ఉదంతమే ప్రధాన ఉదాహరణ. హర్షిత్ ఏ అనుభవం లేకుండా, టీమిండియాలో ఓ పెద్ద తలకాయ మద్దతుతో దాదాపు ప్రతి జట్టులో ప్రత్యక్షమవుతుంటాడు. ఇతగాడికి ప్లేయింగ్ ఎలెవెన్‌లో కూడా అవకాశాలు సులువుగా వచ్చేస్తుంటాయి.
ఇంత లాబీయింగ్ జరిగి తుది జట్టులోకి వచ్చాక ఏమైనా పొడిచేశాడా అంటే, అదీ లేదు. పైగా అతని ఎంపికను కొందరు సమర్దించుకోవడం హాస్యాస్పదం. ఓ పేరుమోసిన వ్యక్తయితే ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడం ఇంకా విడ్డూరం.
అంతిమంగా హర్షిత్ విషయంలో వ్యతిరేకత తారాస్థాయికి చేరడంతో సెలెక్టర్లు కాస్త తగ్గారు. సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. అయితే సౌతాఫ్రికా-ఏతో వన్డే సిరీస్‌కు మరో అవకాశం ఇచ్చి ఈగోను సంతృప్తివరచుకున్నారు.
అర్హులకు అన్యాయం
హర్షిత్ లాంటి అనర్హులు జట్టులో రావడం వల్ల చాలామంది అర్హులకు అన్యాయం జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఇది మరోసారి నిరూపితమైంది. హర్షిత్‌కు అవకాశం ఇవ్వాల్సి రావడంతో మొదటి రెండు టీ20లకు ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అర్షదీప్ సింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు మూడో టీ20లో హర్షిత్‌ను పక్కన పెట్టి అర్షదీప్‌కు అవకాశం ఇవ్వగా, అతడు చెలరేగిపోయాడు. 3 వికెట్లు తీసి టీమిండియాను గెలిపించాడు.
హర్షిత్ విషయంలో అలా.. షమీ, కరుణ్ విషయంలో ఇలా..!
వరుసగా విఫలమవుతున్న హర్షిత్ లాంటి ఆటగాళ్లకు పదేపదే అవకాశాలు ఇస్తున్న సెలెక్టర్లు.. దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్ లాంటి ఆటగాళ్లను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు.
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో షమీ, కరుణ్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. అయినా వీరికి సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అవకాశం దక్కలేదు. కనీసం సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు కూడా సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు.
హర్షిత్ లాంటి ఆటగాళ్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరించే బీసీసీఐ పెద్దలు.. ఒకప్పుడు టీమిండియాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్న షమీ, కరుణ్ లాంటి వారిని మాత్రం విస్మరిస్తున్నారు.
శుభపరిణామం కాదు..!
భారత క్రికెట్‌కు ఇలాంటి అనుభవాలు ఏ మాత్రం మంచివి కావు. అర్హులకు అన్యాయాలు జరుగుతూ పోతుంటే, రానున్న తరాల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించాలనే ఆశ చచ్చిపోతుంది. క్రికెట్‌కు ఇలాంటి అనుభవాలు ఎంత మాత్రం శుభపరిణామం కాదు. అనర్హమైన వ్యక్తుల కోసం దేశ ప్రయోజనాలు పణంగా పెట్టి, అర్హులను విస్మరించడం మంచి సాంప్రదాయం కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
దేశవాలీ క్రికెట్లో సత్తా చాటుతున్న మహ్మద్ షమీ, కరుణ్ నాయర్, పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ లాంటి చాలామంది ఆటగాళ్ల అవేదన ఇది.
చదవండి: పంత్, ఆకాశ్ పునరాగమనం


