Photo Courtesy: IPL 2026
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌లు విజయవంతమైన కెప్టెన్లుగా ముద్రపడ్డారు. ఇందులో ధోని, రోహిత్‌లు ఐదేసి సార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకోగా.. గంభీర్ సారథ్యంలో కేకేఆర్ రెండుసార్లు ఐపీఎల్ టైటిల్స్ అందుకుంది. తాజాగా వీరి సరసన చేరేందుకు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సిద్ధమవుతున్నాడు.
2024లో కేకేఆర్‌కు మూడోసారి టైటిల్ అందించిన శ్రేయస్ లక్కీ కెప్టెన్‌గా మారిపోయాడు. జట్లు మారినప్పటికీ తన కెప్టెన్సీ, ఆటతీరుతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా అయ్యర్ పేరు సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌ను అయ్యర్ విజేతగా నిలబెడితే ధోని, రోహిత్ శర్మను కూడా అధిగమిస్తాడని మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
జియో హాట్‌స్టార్‌కు ఇంటర్య్వూ ఇచ్చిన పఠాన్ మాట్లాడుతూ.. 'ధోని, రోహిత్, గంభీర్ వంటి అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్లను దాటుకొని మరీ తొలి స్థానంలో నిలుస్తాడు. ఎందుకంటే ధోని, రోహిత్, గంభీర్‌లు ఒకే జట్టుకు టైటిల్స్ అందించారు. కానీ అయ్యర్ మాత్రం ఇప్పటికే కేకేఆర్‌కు టైటిల్ అందించాడు.
ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌కు కూడా టైటిల్ అందిస్తే వేర్వేరు జట్లకు టైటిల్స్ అందించిన తొలి కెప్టెన్‌గా అయ్యర్ నిలవనున్నాడు. అంతేకాదు ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, పంజాబ్ ఇలా మూడు వేర్వేరు జట్లను కూడా ఐపీఎల్‌లో ఫైనల్ చేర్చిన ఘనత అయ్యర్ సొంతం. ఒకవేళ అయ్యర్ ఈ సీజన్‌లో అది సాధిస్తే మాత్రం అతడి రికార్డు చెరిగిపోనిదిగా మిగిలిపోతుంది' అని పఠాన్ పేర్కొన్నాడు.
ఇక ఐపీఎల్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న అయ్యర్ 2020 సీజన్‌లో ఆ జట్టును రన్నరప్‌గా నిలిపాడు. ఆ తర్వాత కేకేఆర్‌కు మారిన శ్రేయస్ అయ్యర్ 2024 సీజన్‌లో ఆ జట్టును చాంపియన్‌గా నిలిపాడు.
2025 సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్ 2026 సీజన్‌లోనూ ఆ జట్టును టైటిల్ దిశగా అడుగులు వేయిస్తున్నాడు. పంజాబ్ తరఫున 33 మ్యాచ్‌లు, ఢిల్లీ తరఫున 41 మ్యాచ్‌లు, కేకేఆర్ తరఫున 29 మ్యాచ్‌లకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా పనిచేశాడు. అతని సక్సెస్ రేటు 90 శాతం ఉండడం గమనార్హం.


