టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) అభిమానులకు శుభవార్త. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడిన(స్ల్పీన్ ఇంజూరీ) అయ్యర్.. శరవేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రేయస్ ప్రస్తుతం సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
అయ్యర్ ఆరోగ్యం రోజు రోజుకు మెరుగు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వారంలోపు అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముంది. ఈ విషయాన్ని శ్రేయస్ తండ్రి సంతోష్ అయ్యర్ ధృవీకరించారు.
"శ్రేయస్ వేగంగా కోలుకుంటున్నాడు. బీసీసీఐ వైద్య బృందం అతడి పరిస్థితిని నిశితంగా గమనిస్తోంది. సిడ్నీలోని బెస్ట్ డాక్టర్లు అయ్యర్‌కు చికిత్స అందిస్తున్నారు. అతడు వారంలోపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే అంతకంటే ముందు తిరిగి ఇంటికి రావచ్చు.
అతడు టీ20 జట్టులో బాగం కానుందున నేరుగా ఇంటికే రానున్నాడు. దీంతో సిడ్నీ వెళ్లాలనుకున్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. మేము అక్కడికి వెళ్లడం లేదని" సంతోష్ అయ్యర్ డెక్కన్ క్రానికల్‌తో పేర్కొన్నారు.
అయ్యర్ ఎలా గాయపడ్డాడంటే?
సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో అలెక్స్ క్యారీ క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి శ్రేయస్ అయ్యర్ ఎడమ పక్కటెముకులకు బలంగా తాకింది. దీంతో అతడు తీవ్రమైన నొప్పితో మైదానాన్ని వీడాడు. అయితే అతడి గాయం చిన్నదే అని అంతా భావించారు.
కానీ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన అయ్యర్, కాసేపటికే స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడి అస్పత్రికి తరలించి స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.
స్కాన్‌లో అతడి ప్లీహానికి (స్ప్లీన్) గాయమైనట్లు తేలింది. అంతేకాకుండా అంతర్గత రక్తస్రావం కూడా జరిగిందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో అతడికి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన చెందిన అయ్యర్ తల్లిదండ్రులు సిడ్నీకి పయనమయ్యేందుకు సిద్దమయ్యారు.
కానీ అతడు ఆరోగ్యం కుదుట పడటంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. కాగా శ్రేయస్ పరిస్థితి కాస్త మెరుగుపడటంతో ప్రస్తుతం ఐసీయూ నుంచి బయటకు తీసుకువచ్చినట్లు సమాచారం. భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ కూడా శ్రేయస్ గాయంపై అప్‌డేట్ ఇచ్చాడు. తాను అయ్యర్ మాట్లాడని, బాగానే ఉన్నాడు అని సూర్య చెప్పుకొచ్చాడు. కాగా వచ్చే నెలలలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు శ్రేయస్ దూరమయ్యే అవకాశముంది.
చదవండి: ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!


