టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్‌లో అదరగొట్టాడు. గుజరాత్‌తో పోరులో ఈ రైటార్మ్ బౌలర్ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్‌నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్‌కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో మ్యాచ్‌లో భాగంగా బెంగాల్.. గుజరాత్ జట్టును ఢీకొట్టింది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా ఇరుజట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం మ్యాచ్ మొదలుకాగా.. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
మూడు హాఫ్ సెంచరీలు
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 279 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ ఘరామి (56), వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ధ శతకాల కారణంగా ఈమాత్రం స్కోరు సాధ్యమైంది.
167 పరుగులకే
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ 167 పరుగులకే కుప్పకూలింది. మనన్ హింగ్రాజియా (80) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఈ క్రమంలో 112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది బెంగాల్. ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామి (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ధ శతకాలతో రాణించారు.
ఐదు వికెట్లు కూల్చిన షమీ
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బెంగాల్.. గుజరాత్‌కు 327 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఆది నుంచే చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్ అభిషేక్ దేశాయిని డకౌట్ చేశాడు. జయమీత్ పటేల్ (45), విశాల్ జైస్వాల్ (1), సిద్దార్థ్ దేశాయ్ (0), అర్జాన్ నాగ్వాస్వల్లా (0)లను వెనక్కి పంపించాడు.
మొత్తంగా 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు షమీ. మిగతా వారిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
బెంగాల్ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ అజేయ శతకం (124 బంతుల్లో 109) వృథాగా పోయింది. 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ కావడంతో.. బెంగాల్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.
షమీకి ఫిట్‌నెస్ లేదంటూ..
కాగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన షమీని.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేయలేదు.
ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి ఫిట్‌నెస్ లేదని తెలిపాడు. ఇందుకు షమీ కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడేవాడిని వన్డేలు ఆడలేనా? అన్ని ప్రశ్నించాడు. బెంగాల్ తరఫున ఎలా ఆడుతున్నానో అందరూ చూస్తున్నారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టులకు ముందు.. తాజా ప్రదర్శనతో మరోసారి అగార్కర్‌కు గట్టి సందేశమే ఇచ్చాడు షమీ.
చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్‌డేట్ ఇచ్చిన సూర్య


