అరంగేట్రంలో అదుర్స్‌.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన క‌డ‌ప అమ్మాయి | Shree Charani Takes Memorable 4 Fer On India W Debut | Sakshi
Sakshi News home page

అరంగేట్రంలో అదుర్స్‌.. ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన క‌డ‌ప అమ్మాయి

Jun 29 2025 1:55 PM | Updated on Jun 29 2025 3:08 PM

Shree Charani Takes Memorable 4 Fer On India W Debut

భార‌త యువ స్పిన్న‌ర్ నల్లపురెడ్డి శ్రీ చరణి త‌న అంత‌ర్జాతీయ టీ20 కెరీర్‌ను ఘ‌నంగా ఆరంభించింది. క‌డ‌పకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణి.. శ‌నివారం ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసింది. ఇప్ప‌టికే వ‌న్డేల్లో త‌న స‌త్తాను నిరూపించుకున్న ఈ తెలుగు అమ్మాయి..ఇప్పుడు టీ20ల్లో కూడా త‌న మార్క్ చూపింది.

నాటింగ్‌హామ్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో మొద‌టి టీ20లో చ‌ర‌ణి అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. త‌న స్పిన్ మయాజాలంతో ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవ‌ర్లు మాత్ర‌మే బౌలింగ్ చసిన చ‌రణి.. కేవ‌లం 12 ప‌రుగులిచ్చి 4 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. త‌ద్వారా 212 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టు కేవ‌లం 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ క్ర‌మంలో శ్రీ చరణి ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకుంది.

రెండో ప్లేయ‌ర్‌గా..
అంత‌ర్జాతీయ అరంగేట్రంలో భార‌త మ‌హిళల జ‌ట్టు త‌ర‌పున రెండువ‌ అత్య‌త్తుమ బౌలింగ్ గ‌ణాంకాలు నమోదు చేసిన ప్లేయ‌ర్‌గా చ‌ర‌ణి నిలిచింది. ఈ జాబితాలో అగ్ర‌స్ధానంలో స్రవంతి నాయుడు ఉంది. 2014లో కాక్స్ బజార్ వేదిక‌గా బంగ్లాదేశ్‌పై త‌న డెబ్యూ మ్యాచ్‌లో స్ర‌వంతి తన 4 ఓవ‌ర్ల కోటాలో కేవ‌లం 9 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. 

వీరిద్ద‌రి త‌ర్వాతి స్ధానంలో పూన‌మ్ యాద‌వ్ ఉంది. 2013లో వ‌డోద‌ర వేదిక‌గా బంగ్లాదేశ్‌పై పూన‌మ్ త‌న అరంగేట్ర మ్యాచ్‌లో 21 ప‌రుగులిచ్చి మూడో ప్లేయ‌ర్‌గా నిలిచింది. కాగా ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను భారత మహిళల జట్టు 97 పరుగులతో చిత్తు చేసింది.
చదవండి: 86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్‌ కన్ను మూత
 

Advertisement
 
Advertisement
Advertisement