
వరల్డ్ క్రికెట్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు జట్లు ఎప్పెడెప్పుడు తలపడతాయా? అని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. చివరగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి.
ఇప్పుడు మరోసారి అభిమానులను అలరించేందుకు చిరకాల ప్రత్యర్ధులు సిద్దమయ్యారు. ఆసియాకప్-2025లో భాగంగా ఆదివారం(సెప్టెంబర్ 14) దాయాదులు అమీతుమీ తేల్చుకోనున్నారు. అయితే ఈసారి ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌పై అభిమానుల ఆసక్తి కాస్త తగ్గినట్లు అన్పిస్తోంది.
సాధారణంగా భారత్- పాక్ మ్యాచ్ టిక్కెట్లు నిమిషాల్లో హట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అమ్మకాలు ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికి టిక్కెట్లు ఇంకా పూర్తి స్ధాయిలో అమ్ముడు పోలేదు.
పహల్గామ్ ఉగ్ర దాడి, "ఆపరేషన్ సిందూర్" నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్ కాట్ చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. ఈ కారణంగానే టిక్కెట్లు ఇంకా అమ్ముడుపోలేదని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆదివారం భారత్-పాక్ మ్యాచ్‌కు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం హౌస్ ఫుల్ కావడం ఖాయమని అక్తర్ జోస్యం చెప్పాడు. "భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్దం తర్వాత పాకిస్తాన్ తొలిసారి భారత్‌తో ఆడనుంది. అలాంటిప్పుడు స్టేడియం ఎలా హౌస్ ఫుల్ కాకుండా ఉంటుంది? టిక్కెట్లు అమ్ముడుపోవడం లేదని నాతో ఒకరు అన్నారు. వెంటనే అవన్నీ వట్టి రూమర్సే అని, అన్నీ అమ్ముడుపోయాయి అని చెప్పా. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారమే అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్తర్ పేర్కొన్నాడు.
చదవండి: SA20: సన్ రైజర్స్‌తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక