 
													టీమిండియా ఆల్‌రౌండర్ శివమ్ దూబే వరల్డ్ రికార్డుకు ఎండ్ కార్డ్ పడింది. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టులో భాగమైన ఆటగాడిగా దూబే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దూబే వరుసగా భారత్ జట్టు తరపున 37 టీ20 విజయాలను అందుకున్నాడు.
అతడిని అందరూ టీమిండియా లక్కీ ఛార్మ్‌గా పరిగణిస్తారు. దూబే జట్టులో ఉంటే భారత్‌కు తిరుగుండదని అంతా భావిస్తారు. కానీ శుక్రవారం మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్ ఓడిపోవడంతో అతడి ఆజేయ విన్నింగ్ రికార్డుకు తెరపడింది.
2019లో ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20తో దూబే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన దూబే.. భారత తరపున 4 వన్డేలు, 43 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే అతడు చివరగా 2019 డిసెంబర్‌లో త్రివేండ్రం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్నాడు.
ఆ తర్వాత ఈ ముంబైకర్ వరుసగా 37 టీ20ల్లో విజయాలను అందుకున్నాడు. తాజా ఓటమితో అతడి రికార్డుకు బ్రేక్ పడింది. దూబే గత రెండేళ్లగా భారత టీ20 జట్టులో రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచకప్-2024, ఆసియాకప్-2025 ట్రోఫీలను భారత్ సొంతం చేసుకోవడంలో దూబేది కీలక పాత్ర. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో జస్ప్రీత్ బుమ్రా 24 వరుస టీ20 విజయాల రికార్డు కూడా ముగిసింది.
అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాళ్లు
శివమ్ దూబే - 37 మ్యాచ్‌లు (2019-2025)
పాస్కల్ మురుంగి - 27 మ్యాచ్‌లు (2022-2024*)
జస్ప్రీత్ బుమ్రా - 24 మ్యాచ్‌లు (2021-2025)
మణీష్ పాండే - 20 మ్యాచ్‌లు (2018-2020*)
మహ్మద్ షెహ్జాద్ - 19 మ్యాచ్‌లు (2016-2021)
చదవండి: అతడే మా ఓటమిని శాసించాడు.. అభిషేక్ మాత్రం అద్భుతం: భారత కెప్టెన్
 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
