‘బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసింది’ | Shakib Al Hasan OnT20 WC 2026 Row Calls Bangladesh Boycott A Blunder | Sakshi
Sakshi News home page

‘బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసింది’

Apr 30 2026 6:22 PM | Updated on Apr 30 2026 6:37 PM

Shakib Al Hasan OnT20 WC 2026 Row Calls Bangladesh Boycott A Blunder

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ దిగ్గజం షకీబ్‌ అల్‌ హసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. గత ప్రభుత్వ తప్పిదం కారణంగా బంగ్లా క్రికెట్‌ భారీ నష్టం చవిచూసిందన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి బంగ్లాదేశ్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

అయితే, భారత్‌ వేదికగా ఈ మెగా ఈవెంట్‌ జరుగగా.. పాకిస్తాన్‌ కోసం శ్రీలంకను తటస్థ వేదికగా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. టోర్నీ ఆరంభానికి ముందు భారత్‌-బంగ్లా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొనగా.. ఐపీఎల్‌ నుంచి బంగ్లా బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు.

భద్రతా కారణాలు సాకుగా చూపగా..
ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌ ఆడేందుకు తాము భారత్‌కు రాలేమని.. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్‌ ఐసీసీని కోరింది. ఇందుకు.. బంగ్లా భద్రతా కారణాలు సాకుగా చూపగా.. ఐసీసీ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో ప్రభుత్వ నిర్ణయానుసారం తాము టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్లు బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.

ఈ అంశంపై బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, మాజీ ఎంపీ షకీబ్‌ అల్‌ హసన్‌ తాజాగా స్పందించాడు. ‘‘నిజంగా అతి పెద్ద నష్టం. మా దేశంలో క్రికెట్‌ను ప్రేమించే వాళ్ల సంఖ్య ఎక్కువ. మా ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడుతుంటే చూడాలని అంతా కోరుకున్నారు.

కానీ చివరికి మా జట్టు టోర్నీలోనే లేకుండా పోయింది. అప్పటి ప్రభుత్వం చేసిన అతి పెద్ద తప్పు ఇది. ఆటగాళ్లు వరల్డ్‌కప్‌ టోర్నీలో ఆడటం కలలాంటిది. 

బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తప్పు చేసింది
కానీ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం కారణంగా ఆటగాళ్లు ఈ సువర్ణ అవకాశాన్ని మిస్‌ చేసుకోవాల్సి వచ్చింది’’ అని షకీబ్‌ అల్‌ హసన్‌ అప్పటి ప్రభుత్వం, బంగ్లా క్రికెట్‌ బోర్డు తీరును విమర్శించాడు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.

కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లో ఆతిథ్య భారత్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి వరుసగా రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా భారత్‌కు ఇది మూడో టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌.

ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి తప్పుకొన్న బంగ్లాదేశ్‌.. బీసీసీఐతో సంబంధాల పునరుద్ధరణ కోసం తిరిగి చర్యలు చేపట్టింది. బంగ్లా బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు తమీమ్‌ ఇక్బాల్‌ ఇందుకు కృషి చేస్తున్నాడు.
చదవండి: రియాన్‌ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement