
ఆసియాకప్-2025లో దుబాయ్ వేదికగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అయితే ప్రస్తుతం అంతా పాక్ చెత్త ప్రదర్శన గురించి కాకుండా ఈ మ్యాచ్ అనంతరం చెలరేగిన హ్యాండ్ షేక్ వివాదం గురించే చర్చించుకుంటున్నారు.
కానీ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మాత్రం తమ జట్టు చెత్త ఆటను మర్చిపోలేదు. తాజాగా ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో పాల్గోన్న అఫ్రిది.. తన అల్లుడు షాహీన్ షా అఫ్రిదిని విమర్శించాడు. షాహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
అఫ్రిది బౌలింగ్‌ను భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉతికారేశాడు. కానీ బ్యాటింగ్‌లో మాత్రం అఫ్రిది మెరుపులు మెరిపించాడు. కేవలం 16 బంతుల్లో 33 పరుగులు చేసి పాక్ స్కోర్ 100 పరుగుల మార్కు దాటడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే షాహీన్ బ్యాట్‌తో కాకుండా బంతితో రాణించి ఉంటే బాగుండేదని షాహిద్ అఫ్రిది అన్నాడు.
"షాహీన్ బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు చేశాడు. అతడి ఆడిన ఇన్నింగ్స్ ఫలితంగానే మా జట్టు స్కోర్ 100 పరుగులు దాటింది. అందుకు అతడికి ధన్యవాదాలు. కానీ షాహీన్ నుంచి నేను ఆశించింది పరుగులు కాదు. అతడు నుంచి మంచి బౌలింగ్ కావాలి. అలాగే అయుబ్ నుంచి నేను బౌలింగ్‌ను కోరుకోను.
అతడు పరుగులు చేయాలి. జట్టులో అతడి పాత్ర ఎంటో షాహీన్ ఆర్ధం చేసుకోవాలి. కొత్త బంతిని స్వింగ్ చేసి, వికెట్లు సాధించేందుకు మార్గాలను అన్వేషించాలి. అతను తన గేమ్ ప్లాన్‌పై దృష్టి సారించాలి" అని సామా టీవీ ఇంటర్వ్యూలో అఫ్రిది పేర్కొన్నాడు