‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’ | Rajat Patidar Breaks Silence On India T20 Captaincy Talks, Says Selection Into India T20 Team Is Not On My Mind Now | Sakshi
Sakshi News home page

Rajat Patidar: ‘భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు’

May 31 2026 3:26 PM | Updated on May 31 2026 5:41 PM

Selection into India T20 team is not on my mind Now: Rajat Patidar

ఐపీఎల్‌ ట్రోఫీ కోసం కళ్లు కాచేలా పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎట్టకేలకు గతేడాది తమ చిరకాల కోరికను నెరవేర్చుకుంది. టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి సారథ్యంలో సాధ్యం కాని ఈ ఫీట్‌ను.. రజత్‌ పాటిదార్‌ కెప్టెన్‌గా అరంగేట్రంలోనే సాధించాడు.

ఏమాత్రం అంచనాలు లేకుండా
తద్వారా ఆర్సీబీ అభిమానులకు మరింత ఇష్టమైన ఆటగాడిగా మారిపోయాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి ఈ మేరకు అరుదైన విజయం అందుకున్న పాటిదార్‌.. ఐపీఎల్‌-2026లోనూ ఆర్సీబీని అద్భుత రీతిలో ముందుకు నడిపించాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా సత్తా చాటి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.

మెరుపులు మెరిపించి
ముఖ్యంగా గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో ఈ నాలుగో నంబర్‌ బ్యాటర్‌ దుమ్ములేపాడు. కేవలం 33 బంతుల్లోనే 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాది 93 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఈ సీజన్‌లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో పాటు.. జట్టు ఫైనల్‌ చేరడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

ఇప్పటి వరకు ఈ సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి పాటిదార్‌ 486 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టీమిండియా తరఫున టీ20లలో అరంగేట్రం చేయడం ఖాయమని.. కెప్టెన్‌ రేసులోనూ ముందుంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయంపై రజత్‌ పాటిదార్‌ తాజాగా స్పందించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఆదివారం నాటి ఫైనల్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నన్ను నేనెప్పుడూ టీమిండియా టీ20 కెప్టెన్‌ కావాలని ఊహించుకోలేదు. అసలు ఇపుడు భారత టీ20 జట్టుకు ఎంపిక కావాలనే ఆలోచనే నా మదిలో లేదు.

భారత టీ20 జట్టుకు ఎంపికయ్యే ఆలోచనే లేదు
నా దృష్టి మొత్తం ఐపీఎల్‌-2026 సీజన్‌ మీదే ఉంది. ప్రతి కెప్టెన్‌ ట్రోఫీ గెలవాలని కోరుకుంటాడు. నేను కూడా అంతే. గతేడాది మేము టైటిల్‌ సాధించాము. అక్కడితో ఆ ప్రయాణం ముగిసింది.

తాజా ఎడిషన్‌లో సరికొత్తగా ముందుకు వచ్చాము. 2025లో ఏం జరిగిందన్న విషయం గురించే మాట్లాడుతూ కూర్చుంటే పనులు ముందుకు సాగవు. ప్రస్తుత సీజన్‌లో ఒక్కో మ్యాచ్‌ గెలవడమే లక్ష్యంగా ఇక్కడిదాకా చేరుకున్నాము.

అదంతా నాకు అనవసరం
గతంలో ఆర్సీబీ కెప్టెన్లు ఏం చేశారో నాకు అనవసరం. భవిష్యత్తులో కెప్టెన్‌ అయ్యేవారు ఏం చేస్తారన్న అంశంతోనూ నాకు పనిలేదు. సారథిగా నేనేం చేయగలను అన్నదే ముఖ్యం. వ్యక్తిగతంగా నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపళ్లాలు ఉన్నాయి. 

అయితే, ఎవరినీ నాకు పోటీగా భావించను. నా పనిని పూర్తి చేయడంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. మేము డిఫెండింగ్‌ చాంపియన్లమనే గర్వం మాకు లేదు. మా జట్టు ఈసారి కూడా ట్రోఫీ కోసం అదే స్థాయిలో కృషి​ చేస్తోంది. మా ఆకలి తీరలేదు’’ అని రజత్‌ పాటిదార్‌ పేర్కొన్నాడు.

చదవండి: కెప్టెన్‌ రేసు.. ముగ్గురిని ఎంపిక చేసిన బీసీసీఐ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement