
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
పారిస్: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి పతకం ఖాయం చేసుకుంది. 2022లో ఈ టోరీ్నలో కాంస్య పతకం నెగ్గిన సాత్విక్ జోడీ... ఇప్పుడు రెండో పతకం కైవసం చేసుకోనుంది. తద్వారా 2011 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పతకాల పరంపర దిగి్వజయవంతంగా కొనసాగుతోంది.
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ జంట 21–12, 21–19తో ఆరోన్ చియా–సోహ్ వూయ్‌యిక్ (మలేసియా) ద్వయంపై విజయం సాధించింది. 43 నిమిషాల్లో ముగిసిన పోరులో రెండు సార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన మలేసియా జోడీపై భారత జంట సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో మలేసియా షట్లర్ల చేతిలోనే ఓడి పతకానికి దూరమైన భారత ప్లేయర్లు... ఈ సారి ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు.
‘చాలా ఆనందంగా ఉంది. ఒలింపిక్స్‌లో పరాజయం తర్వాత ఏడాది అనంతరం ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మలేసియా జోడీపై నెగ్గడం సంతోషం. ఆరోన్ జంటతో ఆడటం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. మా మధ్య ఎన్నో రసవత్తర పోరాటాలు జరిగాయి. ఇప్పటి వరకు తలపడ్డ ప్రతీసారి వరుస గేమ్‌ల్లోనే ఫలితం వచి్చంది. అయినా వాటిలో ఉండే ఉత్కంఠ వేరే.
ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌షిప్ పతకం ఖాయం కావడంతో మరింత ఆనందంగా ఉంది, రెండో గేమ్ సమయంలో నియంత్రణలో ఉండాలని అనుకున్నాం. పాయింట్ల కోసం తొందరపడకుండా... ఒక్కో అడుగు ముందుకు వేయాలని భావించాం. దాన్నే ఆచరణలో చూపాం’ అని మ్యాచ్ అనంతరం సాత్విక్–చిరాగ్ పేర్కొన్నారు. మ్యాచ్ ఆరంభంలోనే 59 షాట్‌ల సుదీర్ఘ ర్యాలీ ఆడిన భారత జంట... ఆ తర్వాత కూడా సుదీర్ఘ ర్యాలీలతో కట్టిపడేసింది. చిరాగ్ నెట్ వద్ద తన ప్రతిభ కనబర్చగా... సాత్విక్ సర్విస్‌తో ఆకట్టుకున్నాడు.