
భారత టాప్ ఆర్చర్ వెన్నం జ్యోతిసురేఖ మరో కొత్త ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచ కప్ ఫైనల్ ఈవెంట్ (కాంపౌండ్ విభాగం)లో పతకం నెగ్గిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా రికార్డు సృష్టించింది. చైనాలోని నన్‌జింగ్‌లో జరిగిన ఈ పోటీల్లో సురేఖ కాంస్య పతకం గెలుచుకుంది. ఎనిమిది మంది అగ్రశ్రేణి ఆర్చర్లు పాల్గొన్న ఈ పోటీల సెమీఫైనల్లో సురేఖ 143–145 స్కోరుతో వరల్డ్ నంబర్‌వన్ ఆండ్రియా బెకెరా (మెక్సికో) చేతిలో ఓటమిపాలైంది.
అయితే కాంస్యం కోసం జరిగిన పోరులో సురేఖ 150–145 తేడాతో వరల్డ్ నంబర్ 2 ఎలియా గిబ్సన్ (గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధించింది. ప్రస్తుత ఆసియా క్రీడల విజేత అయిన సురేఖ 15 బాణాలను ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా పక్కాగా సంధించి అందుబాటులో ఉన్న 150 పాయింట్లనూ సాధించడం విశేషం.
గతంలో రెండు సార్లు వరల్డ్ కప్ ఆర్చరీ ఫైనల్ (2022, 2023) ఈవెంట్లో పాల్గొన్న సురేఖ పతకం సాధించడంలో విఫలమైంది. మరో వైపు పురుషుల కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత ఆటగాడు రిషభ్ యాదవ్ అతి స్వల్ప తేడాతో మైక్ స్కాలెసర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడి పతకాన్ని చేజార్చుకున్నాడు.