
ఆసియాకప్-2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. శుక్రవారం (సెప్టెంబర్12) దుబాయ్ వేదికగా ఒమన్‌తో పాక్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు పాక్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు స్వల్ప గాయమైనట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు అతడు దూరంగా ఉన్నట్లు పాక్ మీడియా వర్గాలు వెల్లడించాయి. జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. ప్రాక్టీస్ సెషన్‌లో సల్మాన్ ఆఘా నెక్ బ్యాండ్‌తో కన్పించినట్లు సమాచారం. జట్టుతో పాటు ఐసీసీ ఆకాడమీకి వెళ్లినప్పటికి అతడు ఎటువంటి ప్రాక్టీస్‌లోనూ పాల్గోలేదంట.
ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమ కెప్టెన్ గాయం బారిన పడడంతో పాకిస్తాన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే ముందుస్తు జాగ్రత్తలో భాగంగానే అతడి విశ్రాంతికి ఇచ్చినట్లు పాక్ క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. అతడు ప్రస్తుతం మెడ నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఒమన్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అఘా దూరమైనా.. భారత్‌తో మ్యాచ్‌కు మాత్రం పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. అప్పటికి అతడి గాయం తీవ్రమై భారత్ మ్యాచ్‌కు దూరమైతే పాక్‌కు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పుకోవాలి.
కాగా పాకిస్తాన్ దాదాపు రెండు వారాల ముందే యూఏఈకు చేరుకుంది. ఆసియాకప్ టోర్నీ సన్నాహాకాల్లో భాగంగా అఫ్గానిస్తాన్-యూఏఈలతో ట్రైసిరీస్‌లో పాక్ తలపడింది. ఫైనల్లో అఫ్గాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను పాక్ సొంతం చేసుకుంది. అదే జోరును ఇప్పుడు ఆసియాకప్‌లోనూ కొనసాగించాలని మెన్ ఇన్ గ్రీన్ పట్టుదలతో ఉంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
ఆసియాకప్‌కు పాక్ జట్టు
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రాఫ్, ఫకర్ జమాన్, హారిస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వాసిమ్ జూనియర్, షహిబ్‌జాద ఫర్హాన్, సయామ్ ఆయుబ్, సల్మాన్ మిర్జా, షహీన్ షా అఫ్రిది, సుఫ్‌యాన్ మోకిమ్
చదవండి: Asia Cup 2025: 'అతడొక సంచలనం.. అందుకే వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ అయ్యాడు'