
ఆసియాకప్-2025లో టీమిండియా శుభారంభం చేసింది. బుధవారం దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా కేవలం 4.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేధించింది.
అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుభ్‌మన్ గిల్(9 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 20 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో 93 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని భారత్ అందుకుంది. ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. నాలుగు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్‌లో దుమ్ములేపిన అభిషేక్ శర్మపై సూర్య ప్రశంసల వర్షం కురిపించాడు.
"పిచ్ ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలనుకున్నాము. అందుకే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్నాము. రెండు ఇన్నింగ్స్‌లోనూ వికెట్ ఒకేలా ఉంది. ఈ మ్యాచ్‌లో మా బాయ్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మేము ప్రతీ మ్యాచ్‌లోనూ మా బ్రాండ్ ఆఫ్ క్రికెట్‌ను కొనసాగించాలనకుంటున్నాము.
ఈ మ్యాచ్‌లో మేము అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించాము. మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు ఇటీవల ఛాంపియన్ ట్రోఫీలో ఇక్కడ ఆడారు. పిచ్ బాగానే ఉంది. కానీ వికెట్ కాస్త నెమ్మదిగా ఉంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం దుబాయ్‌లో వాతవారణం చాలా వేడిగా ఉంది.
నిజంగా కుల్దీప్ యాదవ్ ఆసాధరణ ప్రదర్శన కనబరిచాడు. అతడికి దూబే, బుమ్రా, వరుణ్ నుంచి సపోర్ట్ లభించింది. ఇక అభిషేక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడొక అద్భుతం. జట్టు 200 పరుగులు చేధించినా, టార్గెట్ 50 అయినా అతడి ఆట తీరు ఒకే విధంగా ఉంటుంది.
అందుకే అతడు ప్రస్తుతం ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం మా ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనుంది.
చదవండి: Asia Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా.. తొలి జట్టుగా