
ఆసియాకప్-2025ను టీమిండియా అద్బుతమైన విజయంతో ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన తమ తొలి మ్యాచ్‌లో యూఏఈను 9 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే చేధించింది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30), శుబ్‌మన్ గిల్(9 బంతుల్లో 20 నాటౌట్) దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో కేవలం 57 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు, శివమ్ దూబే మూడు వికెట్లు పడగొట్టగారు. వీరితో పాటు బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా వికెట్ సాధించారు.ఇక ఈ మ్యాచ్‌లో కేవలం 4.3 ఓవర్లను టార్గెట్‌ను ఫినిష్ చేసిన భారత్ పలు అరుదైన రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది.
చరిత్ర సృష్టించిన భారత్..
ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో 93 బంతులు మిగిలుండగానే భారత్ లక్ష్యాన్ని చేధించింది. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ పేరిట ఉండేది.
ఆసియాకప్-2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 59 బంతులు మిగిలూండగానే అఫ్గాన్ గెలుపొందింది. తాజా మ్యాచ్‌తో అఫ్గాన్ అల్‌టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది. ఓవరాల్‌గా టీ20ల్లో టీమిండియాకు బంతులు పరంగా ఇదే భారీ విజయం కావడం గమనార్హం. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2021లో స్కాట్లాండ్‌పై 81 బంతుల్లో మిగిలూండగా భారత్ విజయం సాధించింది.
అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్యంతవేగంగా రన్ ఛేజ్ చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. అగ్రస్దానంలో ఇంగ్లండ్ ఉంది. టీ20 ప్రపంచకప్-2024లో ఒమన్‌పై కేవలం 3.1 ఓవర్లలోనే ఇంగ్లండ్ లక్ష్యాన్ని చేధించింది.