
నేడు లక్నో సూపర్ జెయింట్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ 18వ సీజన్‌లో రెండు భిన్నమైన జట్ల మధ్య సమరానికి రంగం సిద్ధమైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ‘ప్లే ఆఫ్స్’కు సమీపించిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ)తో తలపడుతుంది. గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిన లక్నో జట్టు సొంతగడ్డపై జరగనున్న పోరులో సత్తా చాటాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే లక్నో ‘ప్లే ఆఫ్స్’ ఆశలు గల్లంతయ్యే అవకాశమున్న నేపథ్యంలో... సమష్టిగా కదం తొక్కేందుకు రెడీ అయింది.
ఈ సీజన్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముందుకు సాగుతున్న ఆర్‌సీబీ 11 మ్యాచ్‌లాడి 8 విజయాలు, 3 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు లక్నో 11 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 6 పరాజయాలతో 10 పాయింట్లతో ఉంది. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తేనే లక్నో జట్టు ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది.
ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన లక్నో సారథి రిషభ్ పంత్ ఏమాత్రం ప్రభావం చూపెట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్ స్థానాల్లో మార్పు చేసుకున్నా ఫలితం మాత్రం శూన్యంగా మారింది. మరి ఈ మ్యచ్‌లో బెంగళూరు విజయం సాధించి ‘ప్లే ఆఫ్స్’ బెర్త్ ఖరారు చేసుకుంటుందా లేక లక్నో పోటీలో నిలుస్తుందా చూడాలి!
ఒత్తిడిలో పంత్ బృందం
ఈ సీజన్‌లో లక్నో విజయాల్లో టాప్–3 కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్క్‌రమ్, మిచెల్ మార్ష్ , నికోలస్ పూరన్ రాణిస్తుండటంతో ఆ జట్టుకు మంచి ఆరంభాలు లభిస్తున్నాయి. పూరన్ 11 మ్యాచ్‌ల్లో 410 పరుగులు చేయగా... మార్క్‌రమ్ 348 పరుగులు చేశాడు. మార్ష్ 10 మ్యాచ్‌ల్లో 378 పరుగులు కొట్టాడు. మిడిలార్డర్‌లో ఆయుశ్ బదోని కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. అతడు 326 పరుగులు చేయగా... భారీ ఆశలు పెట్టుకున్న పంత్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ఈ సీజన్‌లో పంత్ 12.80 సగటుతో కేవలం 128 పరుగులే చేశాడు. ధాటిగా ఆడగల సత్తాఉన్న పంత్ 99.22 స్ట్రయిక్‌రేట్ మాత్రమే నమోదు చేశాడు. చావో రేవో తేల్చుకునేందుకు బరిలోకి దిగాల్సిన పరిస్థితుల్లో పంత్ మాట్లాడుతూ... ‘మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే ‘ప్లే ఆఫ్స్’ రేసులో ఉంటాం. ఇప్పుడు మా ముందు ఉన్న లక్ష్యం అదే.
టాపార్డర్ మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ప్రతి మ్యాచ్‌లో వాళ్లపైనే భారం వేయడం కూడా తగదు’ అని పంత్ అన్నాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ భారీగా పరుగులు ఇచ్చుకుంటుండగా... ఫీల్డింగ్‌లోనూ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మరి కీలక పోరులో నెగ్గాలంటే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో లక్నో మెరవాల్సిన అవసరముంది.
ఫుల్ ఫామ్‌లో విరాట్...
లీగ్ ఆరంభం నుంచి బరిలోకి దిగుతున్నా... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఆర్‌సీబీ... ఈ సీజన్‌లో తమ కల నెరవేర్చుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గట్లే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శనతో నిలకడగా విజయాలు సాధిస్తోంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుల్ ఫామ్‌లో ఉండటం బెంగళూరుకు ప్రధాన బలం. ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌ల్లో విరాట్ 63.13 సగటుతో 505 పరుగులు చేసి ‘ఆరెంజ్ క్యాప్’ రేసులో ముందు వరుసలో ఉన్నాడు. అందులో 7 అర్ధశతకాలు ఉన్నాయి.
ఆరంభంలో కోహ్లి ఇన్నింగ్స్‌లో స్థిరత్వాన్ని తెస్తే... రజత్ పాటీదార్, జితేశ్ శర్మ, కృనాల్ పాండ్యా దాన్ని కొనసాగిస్తున్నారు. ఆఖర్లో టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ వంటి హిట్టర్లు ఉండటం ఆ జట్టు భారీ స్కోర్లు చేయగలుగుతోంది. అయితే ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకుంది.
చెన్నైతో జరిగిన గత మ్యాచ్‌లో షెఫర్డ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అయితే ఆర్‌సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడు దేవదత్ పడిక్కల్ గాయం కారణంగా దూరవడంతో ఆ జట్టుకు ఇబ్బందికరంగా మారింది. బౌలింగ్‌లో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాళ్, కృనాల్ పాండ్యా, సుయాశ్ శర్మ కీలకం కానున్నారు.
తుది జట్లు (అంచనా)
లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్‌రమ్, మార్ష్ , పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, దిగ్వేశ్ రాఠీ, ఆకాశ్ సింగ్.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, మయాంక్ అగర్వాల్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, ఇన్‌గిడి, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ.