
వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు రోహిత్ శర్మ ఆత్మీయ పలకరింపు
ఆస్ట్రేలియాకు బయలుదేరిన భారత జట్టు
న్యూఢిల్లీ: దాదాపు ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారత జట్టుతో చేరారు. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్ బరిలోకి దిగలేదు. టెస్టు లేదా టి20 జట్టు సభ్యులుగా ఉన్న ఇతర ప్లేయర్లు కలిసి ఆడుతూ బిజీగా ఉండగా వన్డేలకే పరిమితమైన రోహిత్, కోహ్లి మాత్రం టీమ్‌కు దూరంగా ఉన్నారు. వన్డే, టి20ల సిరీస్‌ల కోసం బుధవారం భారత జట్టు రెండు బృందాలుగా ఆ్రస్టేలియాకు బయల్దేరి వెళ్లింది. మొదటి బృందంలో రోహిత్, కోహ్లి, శ్రేయస్, కెపె్టన్ శుబ్‌మన్ గిల్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా రోహిత్, గిల్ భేటీ ఆసక్తిని సంతరించుకుంది. తన స్థానంలోనే గిల్‌ను సెలక్టర్లు వన్డే కెప్టెన్ గా నియమించగా... గిల్ నాయకత్వంలో రోహిత్ తొలిసారి ఆడనున్నాడు. టూర్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లంతా ఒకే చోటికి చేరే క్రమంలో ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రోహిత్‌ను చూసిన గిల్ దగ్గరకు వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. వెంటనే రోహిత్ కూడా ‘ఎలా ఉన్నావు హీరో’ అంటూ ఆత్మీయంగా పలకరించాడు.

టీమ్ బస్సులోకి వెళ్లాక మొదటి సీటులోనే కూర్చున్న కోహ్లికి కూడా గిల్ అభివాదం చేయగా... దానికి బదులిచ్చిన కోహ్లి కెపె్టన్ భుజం తట్టి అభినందించాడు. జట్టు సహచరుల్లో కనిపించిన చిరునవ్వులు అందరి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించాయి. ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు 3 వన్డేలు, 5 టి20లు ఆడుతుంది. ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగుతుంది.
మా అభిమానులకు ఇది ఆఖరి అవకాశం...
భారత టాప్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు ఆ్రస్టేలియాలోని అభిమానులకు ఇది ఆఖరి అవకాశమని ఆ్రస్టేలియా కెపె్టన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఇక్కడ జరిగే మూడు వన్డేల్లో వారి బ్యాటింగ్‌ను చూడాలని అతను సూచించాడు.
అయితే వెన్ను నొప్పితో కమిన్స్ ఈ సిరీస్‌లో ఆడటం లేదు. ‘నిస్సందేహంగా వారిద్దరు ఆటలో చాంపియన్లు. వారితో మేం ఆడినప్పుడల్లా అభిమానులు మ్యాచ్‌లు చూసేందుకు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. గత 15 ఏళ్లలో వారిద్దరు భారత్ ఆడిన ప్రతీ సిరీస్‌లో ఉన్నారు. కాబట్టి ఆ్రస్టేలియాలో ఉన్న ఫ్యాన్స్‌కు వారి ఆటను చూడటం ఇదే ఆఖరిసారి కావచ్చు’ అని కమిన్స్ అభిప్రాయ పడ్డాడు.