సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG) వేదికగా శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ శతక్కొట్టాడు. 237 పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ బౌలర్లను హిట్‌మ్యాన్ ఉతికారేశాడు. మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లితో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు.
రోహిత్ ఓవరాల్‌గా 125 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కోహ్లి (74నాటౌట్; 81 బంతుల్లో 7 ఫోర్లు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఫలితంగా టీమిండియా లక్ష్యాన్ని 38.3 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇక ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, సిరీస్‌గా నిలిచిన రోహిత్ పలు వరల్డ్ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ శర్మ సాధించిన రికార్డులు ఇవే..
👉సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన విదేశీ ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. రోహిత్ ఇప్పటివరకు సేనా దేశాల్లో 95 సిక్స్‌లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(92) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో 3 సిక్స్‌లు బాదిన రోహిత్.. గేల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు.
👉21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతి పెద్ద వయష్కుడిగా రోహిత్ నిలిచాడు.38 ఏళ్ల 178 రోజులు వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర(37 సంవత్సరాలు, 132 రోజులు) పేరిట ఉండేది.
👉వన్డే చరిత్రలో లేటు వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు
👉ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి (5), కుమార సంగక్కర (5)లను హిట్‌మ్యాన్ అధిగమించాడు.
👉ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.
చదవండి: థాంక్యూ ఆస్ట్రేలియా.. ఇదే మా చివరి మ్యాచ్!? రోహిత్, కోహ్లి ఎమోషనల్


