Suresh Raina: రైనా మేనమామ హత్య కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

Robber Who Killed Chennai Super King Star Batsman Suresh Raina Uncle Ashok Kumar Arrested - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా మేనమామ అశోక్ కుమార్, అతని కుమారుడు కౌశల్‌ కుమార్‌ గతేడాది హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇదివరకే 11 మంది నిందితులను పంజాబ్‌ పోలీసులు అదుపులోకి తీసుకోగా, తాజాగా ప్రధాన నిందితుడు చజ్జూ అలియాస్‌ చైమార్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని చైమార్ తెగకు చెందిన దోపిడీ దొంగల ముఠాలకు నాయకుడైన చజ్జూ.. యూపీ సహా పలు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యాకాండలకు తెగబడినట్టు పోలీసులు గుర్తించారు. బరేలీ ప్రాంతంలోని బహేదిలో నివసించే అతను అక్కడ్నించే తన ముఠాను నడిపిస్తుంటాడు. పక్కా సమాచారంతో దాడి చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు చజ్జూను అరెస్ట్ చేసి పంజాబ్ పోలీసులకు అప్పగించారు. 

కాగా, గతేడాది ఆగస్ట్‌ 19న పంజాబ్‌లోని థరియాల్ గ్రామంలో అశోక్ కుమార్ నివాసంలోకి దోపిడీ దొంగలు చొరబడి అతని కుటుంబసభ్యులపై దాడి చేశారు. బీఎస్ఎఫ్ కాంట్రాక్టర్‌గా విధులు నిర్వహించే అశోక్ కుమార్.. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దోపిడీ దొంగలు కర్రలతో తీవ్రంగా కొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అతని భార్య, మరో కుటుంబ సభ్యుడు చావుబతుకులలో పోరాడి కోలుకోగా, కుమారుడు కౌశల్‌ కుమార్‌ ప్రాణాలు విడిచాడు. అప్పట్లో ఈ హత్య ఘటనతో దిగ్భ్రాంతికి గురైన సురేశ్ రైనా ఐపీఎల్ ఆడకుండా యూఏఈ నుంచి హుటాహుటిన భారత్‌కు వచ్చేశాడు. తన బంధువుల ఇంట్లో జరిగిన ఘాతుకంపై దర్యాప్తు జరిపించాలంటూ పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్‌కు విజ్ఞప్తి చేశాడు.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top