బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న తొలి అనాధికారిక టెస్టు రసవత్తరంగా మారింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-ఎ టీమ్ 4 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది.
చివరి రోజు ఆటలో భారత్ విజయానికి ఇంకా 156 పరుగులు కావాలి. క్రీజులో కెప్టెన్ రిషబ్ పంత్(64), ఆయూష్ బదోని(0) ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో పంత్ నిరాశపరిచినప్పటికీ (17 పరుగులు).. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అద్భుతమైన నాక్ ఆడుతున్నాడు. భారత్ ఆశలన్నీ పంత్ పైనే ఉన్నాయి. పంత్‌తో పాటు బదోని కూడా రాణించాల్సిన అవసరముంది. వీరిద్దరూ ఔటైతే తర్వాత చెప్పుకోదగ్గ బ్యాటర్లు ఎవరూ లేరు.
30/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన సౌతాఫ్రికా-ఎ టీమ్.. అదనంగా 169 పరుగులు చేసి ఆలౌటైంది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు వికెట్లు సాధించారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో లెసెగో సెనోక్‌వానే (37), జుబేర్ హంజా (37) రాణించారు.
సత్తాచాటిన తనుశ్
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్‌డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్‌నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. భారత-ఎ జట్టు మాత్రం తమ తొలి ఇన్నింగ్స్‌లో తీవ్ర నిరాశపరిచింది.
భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదన్పించారు.
చదవండి: టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు


