PC: PBKS/BCCI
ఐపీఎల్-2026లో పంజాబ్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్ములేపుతోంది. గతేడాది ఫైనల్‌కు చేరిన ఈ జట్టు.. ఈ సీజన్‌లో ఇప్పటికి ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. ఇందులో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. మిగిలిన ఆరింటిలోనూ గెలిచి జైత్రయాత్ర కొనసాగిస్తోంది.
రెండేళ్లుగా పంజాబ్ అద్భుత విజయాలు సాధించడంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)ది కీలక పాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడి రాకతో జట్టు రాతే మారిపోయింది. ఒకప్పుడు పసలేని జట్టుగా ఉన్న పంజాబ్‌కు ఇప్పుడు అమితమైన క్రేజ్ ఏర్పడింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నీరాజనాలు అందుకుంటోంది.
రూ. 26.75 కోట్ల భారీ ధరకు
కాగా 2024లో కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను.. అనూహ్యంగా ఆ ఫ్రాంఛైజీ వదిలేసుకుంది. ఈ క్రమంలో 2025 మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్ల భారీ ధరకు అయ్యర్‌ను కొనుగోలు చేసింది. పంజాబ్ కోచ్ రిక్కీ పాంటింగ్ పట్టుబట్టి మరీ ఖర్చు ఎంతైనా వెనుకాడకుండా శ్రేయస్‌ను ఏరికోరి కొనుగోలు చేయించాడు.
పైసా వసూల్ ప్రదర్శన
పాంటింగ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శ్రేయస్ అయ్యర్ పైసా వసూల్ ప్రదర్శన ఇస్తున్నాడు. చివరగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడిన పంజాబ్.. 265 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనను సునాయాసంగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ (36 బంతుల్లో 71 నాటౌట్)తో మెరిశాడు.
అందుకే శ్రేయస్ కోసం రూ. 26.75 కోట్లు ఖర్చు చేశాం
ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ రిక్కీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఐపీఎల్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘అతడొక గొప్ప వ్యక్తి. అందుకే వేలంలో అతడి కోసం ఎంత ఖర్చైనా పర్లేదని నేను కఠినంగా ముందుకు వెళ్తూనే ఉన్నాను.
శ్రేయస్ ఒక గొప్ప నాయకుడు. పంజాబ్ జట్టును అతడు పునర్నిర్మిస్తాడని నేను గట్టిగా నమ్మాను. శ్రేయస్ ఆఖరి వరకు క్రీజులో ఉన్నాడంటే లక్ష్యం ఎంత పెద్దదైనా ఛేదించగలమని నాకు తెలుసు. ఇప్పుడు కూడా అతడు అద్భుతం చేశాడు.
‘నువ్వు ఆఖరి వరకు నిలబడ్డావంటే ఈ మ్యాచ్ మనం కచ్చితంగా గెలుస్తామని చెప్పాను’. అన్నట్లుగానే అతడు పని పూర్తి చేశాడు’’ అని రిక్కీ పాంటింగ్ శ్రేయస్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా గతేడాది 604 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఈ సీజన్‌లో ఇప్పటికి ఆరు ఇన్నింగ్స్ ఆడి 279 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
చదవండి: Vaibhav Sooryavanshi: పర్సనల్‌గా అంటే నచ్చదు.. అందుకే చితక్కొట్టా
Who would have thought chasing 264 in T20 Cricket. 🤷
- Shreyas Iyer led PBKS chased down 264 runs in 18.5 overs against DC. pic.twitter.com/iith1lLgiW— Kashif (@KashifNdmCric) April 25, 2026


