అనుభ‌వం లేనోళ్లే ఎక్కువ‌.. అయినా కుమ్మేస్తున్నారు! | Reason Behind Rajasthan Royals Tremendous Performance IPL 2026 | Sakshi
Sakshi News home page

Rajasthan Royals: అనుభ‌వం లేనోళ్లే ఎక్కువ‌.. అయినా కుమ్మేస్తున్నారు!

Apr 8 2026 11:04 AM | Updated on Apr 8 2026 11:25 AM

Reason Behind Rajasthan Royals Tremendous Performance IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ దూకుడు మాములుగా లేదు. అన్ని జ‌ట్ల‌తో పోలిస్తే రాజ‌స్తాన్ తుది జ‌ట్టులోని స్వ‌దేశీ ఆట‌గాళ్ల‌లో అనుభ‌వం లేని ఆట‌గాళ్లే ఎక్కువ‌గా క‌నిపిస్తారు. జ‌ట్టు మొత్తం కుర్రాళ్ల‌తో నిండిపోయిన‌ప్ప‌టికీ యువ‌రక్తం కావ‌డంతో జోష్ రెండింత‌లు అయిన‌ట్లుంది.   

జ‌ట్టులో ర‌వీంద్ర జ‌డేజా మాత్ర‌మే టీమిండియా త‌ర‌ఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు. జ‌డేజాను మిన‌హాయిస్తే మిగ‌తా ఆట‌గాళ్ల‌కు అనుభ‌వం త‌క్కువే.  కాగా ఈ సీజ‌న్‌లో రాజ‌స్తాన్ తాము ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజ‌యాలు సాధించి మెరుగైన ర‌న్‌రేట్‌తో ప‌ట్టిక‌లో అగ్ర‌స్థానంలో కొన‌సాగుతోంది.  

జ‌ట్టులో కూడా ఒక‌రిని మించి మ‌రొక‌రు చెల‌రేగిపోతుండ‌డం వారికి సానుకూలాంశంగా మారింది. జైస్వాల్ నుంచి ఆర్చర్ దాకా బ్యాటింగ్ చేసే వాళ్లే ఉండడం రాజస్తాన్‌కు ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బౌలింగ్ కూడా సమతుల్యతతో ఉండడం కలిసొచ్చే అంశం.

భయపెడుతున్న వైభవ్‌..
52, 31, 39.. ఇవి ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ సాధించిన పరుగులు. చేసింది తక్కువ స్కోరే అయినప్పటికీ అతడి దనాధన్ బ్యాటింగ్ ప్రభావం ప్రత్యర్థి జట్లపై గట్టిగానే చూపిస్తోంది. క్రీజులో ఉన్నంతసేపు దంచుడే పరమావధిగా పెట్టుకున్నసూర్యవంశీ భారీ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతున్నాడు. విధ్వంసకర స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి తన తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడంలో సక్సెస్ అయ్యాడు. ముంబైతో మ్యాచ్‌లో బుమ్రా, దీపక్ చాహర్ పదునైన బంతులను సిక్సర్లుగా మలిచిన తీరు అభినందనీయమని చెప్పొచ్చు.

జైస్వాల్ మోత..
సాధారణంగా యశస్వి జైస్వాల్ చూడ్డానికి బక్కపలుచగా ఉన్నప్పటికీ అతడి ఆటతీరు మాత్రం అసాధారణమని చెప్పొచ్చు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో  ఇప్పటికే రెండు అర్థసెంచరీలు సాధించిన జైస్వాల్ ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకెళ్తున్నాడు. రాజస్తాన్‌కు ఓపెనర్లిద్దరే సగం బలం అని చెప్పొచ్చు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చే ధ్రువ్ జురేల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో జురేల్ 75 పరుగుల ఇన్నింగ్స్ రాజస్తాన్ గెలుపుకు కారణమైంది.

పరాగ్ నాయకత్వం..
జట్టు విజయాలు సాధిస్తుంటే తప్పులు పెద్దగా కనిపించవు. ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్‌లో మెరుపులు లేనప్పటికీ అతని కెప్టెన్సీలో రాయల్స్ చెలరేగిపోవడం అతని వ్యక్తిగత ప్రదర్శన గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించడం లేదు. 

నాయకుడిగా మూడు మ్యాచ్‌ల్లో సక్సెస్ అయిన పరాగ్ బ్యాటింగ్‌లోనూ అదరగొడితే రాయల్స్‌కు తిరుగు లేనట్లే. హెట్‌మైర్‌, జడేజా వంటి అనుభవజ్ఞులు తమదైన రోజున ఎంత ప్రమాదకర ఆటగాళ్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

బౌలింగ్‌లోనూ అదుర్స్‌..
బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ రాజస్తాన్ అదుర్స్ అనిపిస్తోంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఫామ్‌లో ఉండడం, స్పిన్నర్లు రవి బిష్ణోయ్‌, జడేజాల స్పిన్ మాయజాలాం, నండ్రీ బర్గర్ సూపర్ బౌలింగ్‌, తుషార్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా ముద్ర ఉండడంతో అంతా మ్యాచ్ విన్నర్లుగానే కనిపిస్తున్నారు.

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి తొలి టైటిల్ ఎగరేసుకుపోయిన రాజస్తాన్ ఆ తర్వాత మళ్లీ టైటిల్ సాధించలేకపోయింది. శాంసన్ వచ్చిన తర్వాత రాయల్స్ ఆటతీరు మారడమే గాక 2024లో ఫైనల్ వరకు చేరుకుంది. 

ఇప్పుడు శాంసన్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్న పరాగ్ అదే లెగసీని కంటిన్యూ చేస్తున్నాడు. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న రాజస్తాన్ రాయల్స్ సీజన్ మొత్తం ఇదే తరహా ఆటతీరు ప్రదర్శిస్తే కప్ కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.

చదవండి: కేకేఆర్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం.. దిగొచ్చిన అయ్యర్‌ సోదరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement