కోహ్లీ వీరవిహారం.. చాంపియ‌న్స్‌గా ఆర్సీబీ | RCB Clinch IPL 2026 Title-Beating Gujarat Titans By 5 Wickets | Sakshi
Sakshi News home page

IPL 2026: కోహ్లీ వీరవిహారం.. చాంపియ‌న్స్‌గా ఆర్సీబీ

May 31 2026 11:28 PM | Updated on May 31 2026 11:39 PM

RCB Clinch IPL 2026 Title-Beating Gujarat Titans By 5 Wickets

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 చాంపియ‌న్‌గా రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచింది. ఆదివారం అహ్మ‌దాబాద్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. చేజింగ్ మాస్ట‌ర్‌గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖ‌రి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 

విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 ప‌రుగులు) ఆర్సీబీ విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ర‌బాడ, అర్షద్‌ ఖాన్‌ తలా వికెట్ తీశారు. 

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 155 ప‌రుగులు చేసింది. వాషింగ్ట‌న్ సుంద‌ర్ (50 నాటౌట్‌), నిషాంత్ సిందూ (20 ప‌రుగులు) ఆడుతున్నారు. ర‌సిక్ స‌లామ్ 3 వికెట్లు తీయ‌గా, హాజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.

కోహ్లీ కమాల్‌..
156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్‌, కోహ్లీలు కలిసి తొలి వికెట్‌కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్‌, పాటీదార్‌లు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్‌)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.

ఆర్సీబీ అరుదైన ఫీట్‌
ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జ‌ట్టుగా ఆర్సీబీ రికార్డుల‌కెక్కింది. గ‌తంలో చెన్నై సూప‌ర్‌కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్‌ను  సాధించాయి.

Advertisement
 
Advertisement
Advertisement