ముంబై ఇండియన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ ఘనవిజయం
వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన మ్యాచ్
గువాహటి: ఐపీఎల్ 19వ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్తాన్ మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. భారీ వర్షం కారణంగా నిర్ణీత సమయం కంటే రెండున్నర గంటలు ఆసల్యంగా ప్రారంభమైన మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (32 బంతుల్లో 77 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు), వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39; 1 ఫోర్, 5 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు. అనంతరం ముంబై తడబడింది. 11 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసి ఓడింది. రికెల్టన్ (8), రోహిత్ (5), సూర్యకుమార్ (6), తిలక్ (14), హార్దిక్ (9) విఫలమయ్యారు.
దంచుడే... దంచుడు
మ్యాచ్‌ను రాయల్స్ మెరుపులతో ఆరంభించింది. చహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో జైస్వాల్ 4, 6, 4, 4, 4 కొట్టడంతో 22 పరుగులు రాగా... బుమ్రా వేసిన మరుసటి ఓవర్‌లో వైభవ్ రెండు సిక్స్‌లు బాదాడు. బౌల్ట్ వేసిన మూడో ఓవర్‌లో జైస్వాల్ రెండు, వైభవ్ ఒక సిక్స్ కొట్టడంతో మరోసారి 22 పరుగులు వచ్చాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ 58 పరుగులు చేసింది.
4వ ఓవర్‌లో హార్దిక్ నాలుగు పరుగులే ఇవ్వగా... శార్దుల్ వేసిన ఐదో ఓవర్‌లో 6, 4, 6 కొట్టిన వైభవ్ మరో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. దీంతో 80 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ధ్రువ్ జురేల్ (2) విఫలం కాగా... కెప్టెన్ రియాన్ పరాగ్ (10 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఉన్నంతసేపు ధాటిగా ఆడాడు.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (నాటౌట్) 77; వైభవ్ (సి) తిలక్ (బి) శార్దుల్ 39; జురేల్ (ఎల్బీ) ఘజన్‌ఫర్ 2; పరాగ్ (సి) తిలక్ (బి) ఘజన్‌ఫర్ 20; హెట్‌మైర్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (11 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1–80, 2–84, 3–121. బౌలింగ్: దీపక్ చహర్ 1–0–22–0; బుమ్రా 3–0–32–0; బౌల్ట్ 1–0–22–0; హార్దిక్ 2–0–17–0; శార్దుల్ 2–0– 36–1; ఘజన్‌ఫర్ 2–0–21–2.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) జురేల్ (బి) ఆర్చర్ 8; రోహిత్ (సి) జురేల్ (బి) సందీప్ 5; సూర్యకుమార్ (సి) ఆర్చర్ (బి) బర్గర్ 6; తిలక్ (సి) హెట్‌మైర్ (బి) బిష్ణోయ్ 14; హార్దిక్ (సి) జైస్వాల్ (బి) బిష్ణోయ్ 9; నమన్ (సి) బిష్ణోయ్ (బి) బర్గర్ 25; రూథర్‌ఫోర్డ్ (సి) సందీప్ (బి) దేశ్‌పాండే 25; శార్దుల్ (సి) జురేల్ (బి) సందీప్ 8; దీపక్ (నాటౌట్) 5; బౌల్ట్ (రనౌట్) 1; బుమ్రా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (11 ఓవర్లలో 9 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1–10, 2–20, 3–22, 4–41, 5–46, 6–93, 7–103, 8–111, 9–116. బౌలింగ్: ఆర్చర్ 2–0–17–1; బర్గర్ 2–0–21–2; సందీప్ 3–0–26 –2; దేశ్‌పాండే 2–0–29–1; బిష్ణోయ్ 2–0–25–2.


