ఐపీఎల్ 2026లో వరుస విజయాలతో దూసుకుపోతూ, ఏకైక అజేయ జట్టుగా కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్ టీమ్‌లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ తల్లి ఇవాళ (ఏప్రిల్ 27) కన్నుమూశారు. ఈ వార్త పంజాబ్ కింగ్స్ శిబిరాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఒమర్‌జాయ్‌కు అతని జాతీయ జట్టు సహచరులు, పంజాబ్ కింగ్స్ బృంద సభ్యులు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నారు. ఈ విషాద వార్తను ఆఫ్ఘనిస్తాన్ మాజీ కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఒమర్జాయ్‌కు గురువుగా భావించే అస్గర్, అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. "అల్లాహ్ ఆమెకు జన్నత్ ప్రసాదించాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను" అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.
ఈ హఠాత్పరిణామంతో ఒమర్జాయ్ ఐపీఎల్‌ను మధ్యలో వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉండేందుకు అతడు త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్లే అవకాశం ఉంది. అయితే మిగిలిన సీజన్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నదానిపై కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ అద్భుత ప్రదర్శన చేస్తోంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో జట్టు ఇప్పటివరకు అపరాజితంగా కొనసాగుతోంది. బలమైన జట్టు కూర్పు కారణంగా ఒమర్జాయ్‌కు ఈ సీజన్‌లో ఇంకా ఒక్క అవకాశం కూడా రాలేదు.
గత సీజన్‌లో పంజాబ్ తరఫున అతడు కొన్ని కీలక ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా బౌలింగ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఒమర్జాయ్ ఐపీఎల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగలేదు. 2024లో గుజరాత్ టైటాన్స్ తరఫున అరంగేట్రం చేసిన అతడు, ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ఒమర్‌జాయ్‌కు ప్రతిభకు తగ్గ అవకాశాలు రావడం లేదు. కాగా, పంజాబ్ రేపు సొంత మైదానం ముల్లాన్‌పూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.


