210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ కింగ్స్
5 వికెట్లతో చెన్నై పరాజయం
శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీ
చెన్నై సూపర్‌కింగ్స్‌కి కోట లాంటి చెపాక్ మైదానంలో ఒక్క పంజాబ్‌కు మాత్రమే చెన్నైని ఎక్కువ సార్లు ఓడించిన ఘనమైన రికార్డు ఉంది. గత మూడు సీజన్లలో ఇక్కడ సూపర్ కింగ్స్‌ను మట్టికరిపించిన పంజాబ్ ఈసారీ దానిని కొనసాగించింది. ముందుగా చెన్నై 209 పరుగుల భారీ స్కోరు చేసినా... మరో 8 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ గెలుపు సొంతం చేసుకుంది. స్పిన్నర్ చహల్ పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరును నియంత్రించగా, ఛేదనలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో పంజాబ్ కింగ్స్ జట్టును విజయం దిశగా నడిపించాడు.
చెన్నై: గత ఏడాది ఐపీఎల్ రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 5 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (43 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించగా...శివమ్ దూబే (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) సర్ఫరాజ్ ఖాన్ (12 బంతుల్లో 32; 6 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు.
అనంతరం పంజాబ్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 210 పరుగులు సాధించి గెలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేయగా... ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 43; 6 ఫోర్లు, 1 సిక్స్), ప్రియాన్ష్ ఆర్య (11 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కూపర్ కనోలీ (22 బంతుల్లో 36; 6 ఫోర్లు) మెరిపించారు.
సర్ఫరాజ్ జోరు...
వరల్డ్ కప్ హీరో సామ్సన్ (7) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ప్రభావం చూపకపోగా... కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (22 బంతుల్లో 28; 2 ఫోర్లు) విఫలమయ్యాడు. అయితే మరోవైపు ఆయుశ్ మాత్రే జోరుతో స్కోరు దూసుకుపోయింది. పవర్‌ప్లేలో జట్టు 57 పరుగులు చేసింది. మాత్రేతో రెండో వికెట్‌కు రుతురాజ్ గైక్వాడ్ 55 బంతుల్లో 96 పరుగులు జోడించగా... అతని వాటా 22 పరుగులు మాత్రమే! ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మాత్రే, కార్తీక్ (1) అవుట్ కాగా,
అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతోసర్ఫరాజ్ చెలరేగాడు. ఆ తర్వాత వైశాక్ ఓవర్లో వరుసగా 4, 4, 4 కొట్టిన అతను తర్వాతి బంతికి వెనుదిరిగాడు. అర్ష్ దీప్ వేసిన ఆఖరి ఓవర్లో మూడు ఫోర్లు కొట్టి దూబే జట్టు స్కోరును 200 దాటించాడు.
సమష్టి ప్రదర్శన...
ఛేదనలో పంజాబ్ టాప్–4 తమ వంతు పాత్ర పోషించారు. తాను ఆడిన తొలి 6 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో ప్రియాన్ష్ దూకుడుగా మొదలుపెట్టగా, కంబోజ్ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ 3 ఫోర్లు బాదాడు. పవర్‌ప్లేలో స్కోరు 68 పరుగులకు చేరింది. ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కనోలీ, శ్రేయస్ అదే ధాటిని కొనసాగించారు. చహర్ ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన శ్రేయస్... హెన్రీ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 26 బంతుల్లో అతని హాఫ్ సెంచరీ పూర్తయింది. విజయానికి 24 పరుగుల దూరంలో అతను అవుటైనా, ఇతర బ్యాటర్లు లాంఛనం పూర్తి చేశారు.
ప్రశాంత్ వీర్ అరంగేట్రం...
గత మ్యాచ్‌లో రూ.14.20 కోట్ల విలువైన ఆటగాడు కార్తీక్ శర్మతో అరంగేట్రం చేయించిన చెన్నై... ఈ మ్యాచ్‌లో మరో రూ.14.20 కోట్ల ప్లేయర్ ప్రశాంత్ వీర్‌కు తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం ఇచ్చింది. ప్రధానంగా లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన 20 ఏళ్ల ప్రశాంత్ లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగల సమర్థుడు. బీసీసీఐ అండర్–23 టోర్నీతో పాటు సీఎస్‌కే ట్రయల్స్‌లో ఆకట్టుకోవడంతో రవీంద్ర జడేజా తరహా ఆటగాడైన వీర్‌ను జట్టు ఎంచుకుంది. యూపీ టి20 లీగ్‌లో 155 స్ట్రయిక్‌రేట్‌లో 320 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీసి ప్రశాంత్ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
6-చెపాక్ మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును అత్యధికసార్లు (6) ఓడించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ గుర్తింపు పొందింది. ముంబై ఇండియన్స్ (21 సార్లు) తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన రెండో జట్టు పంజాబ్ (17 సార్లు). బెంగళూరు (16 సార్లు) మూడో స్థానానికి వెళ్లింది.
36-ఐపీఎల్ టోర్నీ చరిత్రలో అత్యధికసార్లు 200 పరుగులకు పైగా స్కోరు చేసిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించింది. ఇప్పటి వరకు చెన్నై జట్టు 36 సార్లు 200 మార్క్‌ను దాటింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 35 సార్లు... పంజాబ్ కింగ్స్ 33 సార్లు, ముంబై ఇండియన్స్ 32 సార్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ 30 సార్లు ఈ ఘనత సాధించాయి.
స్కోరు వివరాలు
చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) ప్రభ్‌సిమ్రన్ (బి) బార్ట్‌లెట్ 7; రుతురాజ్ (సి) వధేరా (బి) చహల్ 28; ఆయుశ్ (సి) మాత్రమే (బి) వైశాక్ 73; దూబే (నాటౌట్) 45; కార్తీక్ (ఎల్బీ) (బి) యాన్సెన్ 1; సర్ఫరాజ్ (సి) వధేరా (బి) వైశాక్ 32; ప్రశాంత్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1–14, 2–110, 3–123, 4–130, 5–168. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–41–0, బార్ట్‌లెట్ 4–0–48–1, యాన్సెన్ 4–0–43–1, వైశాక్ 4–0–38–2, చహల్ 3–0–21–1, స్టొయినిస్ 1–0–17–0.
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (బి) హెన్రీ 39; ప్రభ్‌సిమ్రన్ (రనౌట్) 43; కనోలీ (సి) హెన్రీ (బి) కంబోజ్ 36; శ్రేయస్ (సి) చహర్ (బి) కంబోజ్ 50; వధేరా (సి) నూర్ (బి) హెన్రీ 10; శశాంక్ (నాటౌట్) 14; స్టొయినిస్ (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (18.4 ఓవర్లలో 5 వికెట్లకు) 210. వికెట్ల పతనం: 1–61, 2–95, 3–127, 4–186, 5–186. బౌలింగ్: ఖలీల్ 3–0–28–0, హెన్రీ 4–0–54–2, కంబోజ్ 3.4–0–43–2, నూర్ 4–0–38–0, రాహుల్ చహర్ 4–0–46–0.


