ఆఖరి మ్యాచ్‌లో జైపూర్‌పై గెలుపు
ముగిసిన పీకేఎల్ లీగ్ దశ
రేపటి నుంచి ప్లేఆఫ్స్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో మూడుసార్లు చాంపియన్ పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో పట్నా 33–18 పాయింట్ల తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై విజయం సాధించింది. దీంతో లీగ్ దశలో 18 మ్యాచ్‌లాడిన పట్నా పైరేట్స్ 8 విజయాలు, 10 పరాజయాలతో 16 పాయింట్లు ఖాతాలో వేసుకొని ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. లీగ్ ఆరంభ దశలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన పైరేట్స్... వరుసగా ఐదో మ్యాచ్‌లో గెలిచి ముందంజ వేసింది.
కీలకపోరులో పట్నా కెపె్టన్ అయాన్ 11 పాయింట్లతో సత్తా చాటాడు. మ్యాచ్ తొలి అర్ధభాగంలో హోరాహోరీ పోరాటం సాగడంతో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ద్వితీయార్ధంలో విజృంభించిన పట్నా సమష్టిగా సత్తాచాటి ముందంజ వేసింది. గురువారంతో ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రోజే జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్ 35–32తో యు ముంబాపై, బెంగళూరు బుల్స్ 54–26తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందాయి.
యూపీ యోధాస్ తరఫున సురేందర్ గిల్, శివమ్ చెరో 7 పాయింట్లు సాధించగా... యు ముంబా తరఫున అజిత్ చవాన్ 11 పాయింట్లతో పోరాడాడు. గుజరాత్ జెయింట్స్‌తో పోరులో బెంగళూరు బుల్స్ రెయిడర్లు ఆకాశ్ 11, అలీ రెజా 10 పాయింట్లతో సత్తా చాటారు. గుజరాత్ జెయింట్స్ తరఫున శ్రీధర్ 8 పాయింట్లతో పోరాడాడు.
ఈ సీజన్‌లో మొత్తం 12 జట్లు పోటీపడగా... వాటిలో 8 జట్లు (పుణేరి పల్టన్, దబంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్, హర్యానా స్టీలర్స్, యు ముంబా, పట్నా పెరైట్స్, జైపూర్ పింక్ పాంథర్స్) ప్లే ఆఫ్స్‌కు చేరాయి. లీగ్‌లో నేడు విశ్రాంతి దినం కాగా... శనివారం నుంచి ప్లే ఆఫ్స్ ప్రారంభమవుతాయి.


