
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సప్నా గిల్ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు ముంబైలోని ఓ సెషన్స్ కోర్టు 100 రూపాయల జరిమానా విధించింది. ఈ కేసులో షా తన సమాధానాన్ని కోర్టులో దాఖలు చేయకపోవడంతో న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. నామమాత్రపు జరిమానాతో చివరి అవకాశం ఇస్తూ.. తదుపరి విచారణను డిసెంబర్ 16కి వాయిదా వేశారు.
కేసు నేపథ్యం (సప్నా ఫిర్యాదు ప్రకారం)..
2023 ఫిబ్రవరి 15న, అంధేరీలోని (ముంబై) ఓ పబ్ వద్ద పృథ్వీ షా, సప్నా గిల్ మధ్య ఘర్షణ జరిగింది. సప్నా స్నేహితుడు షాను సెల్ఫీలు కోరగా మొదట అంగీకరించాడు. ఆతర్వాత సదరు వ్యక్తి కాస్త అతిగా ప్రవర్తించడంతో షా సెల్పీ ఇచ్చేందుకు నిరాకరించాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.
పక్కనే ఉన్న సప్నా జోక్యం చేసుకుని సర్ది చెప్పబోగా, షా ఆమె స్నేహితుడి ఫోన్‌ను లాక్కొని విసిరికొట్టాడు. అంతటితో ఆగకుండా సప్నాను లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని సప్నా దగ్గర్లోని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె అంధేరి మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. 2024 ఏప్రిల్‌లో మేజిస్ట్రేట్ కోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశిస్తూ, సాంతాక్రూజ్ పోలీస్ స్టేషన్‌కు కేసు అప్పగించింది.
సప్నా లాయర్ ఏమంటున్నాడంటే..
షా ఇప్పటివరకు కోర్టు సమన్లను నిర్లక్ష్యం చేస్తూ విచారణను ఆలస్యం చేస్తున్నాడని సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ ఆరోపించారు. ఇది అతని స్థిరమైన ప్రవర్తన అని, కోర్టు ప్రక్రియను ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు.
షా దేశవాలీ కెరీర్ విషయానికొస్తే.. ఇటీవలే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. ఆ జట్టు తరఫున తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో (బుచ్చిబాబు టోర్నీ) మెరిశాడు. ప్రస్తుతం అతను టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు.