
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 14) జరిగిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాచ్ పూర్తయ్యాక భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిపోయారు. దీన్ని అవమానంగా భావించిన పాక్ క్రికెట్ బోర్డు భారత ఆటగాళ్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత ప్లేయర్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా పీసీబీ నిన్నటి మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌పై (జింబాబ్వే) కూడా ఐసీసీకి కంప్లైంట్ చేసింది. పైక్రాఫ్ట్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిపై పీసీబీ చైర్మన్ మొహిసిన్ నఖ్వీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ICC కోడ్ ఆఫ్ కండక్ట్, MCC Spirit of Cricket నిబంధనలను పైక్రాఫ్ట్ ఉల్లంఘించారు. వెంటనే ఆయన్ని తొలగించాలి” అని పేర్కొన్నారు.
పైక్రాఫ్ట్‌కు ఏం సంబంధం..?
నిన్నటి భారత్-పాక్ మ్యాచ్‌కు రిఫరిగా వ్యవహరించిన పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్లు క్రీడా స్పూర్తికి విరుద్దంగా (షేక్ హ్యాండ్ ఇవ్వకుండా) ప్రవర్తించడాన్ని లైట్‌గా తీసుకున్నాడని పీసీబీ ఆరోపిస్తుంది. పైక్రాఫ్ట్ భారత ఆటగాళ్ల ప్రవర్తనపై చర్య తీసుకోలేదని అంటుంది.
టాస్ సమయంలో పైక్రాఫ్ట్ ఇరు కెప్టెన్లను హ్యాండ్‌షేక్ ఇచ్చుకోవద్దని చెప్పినట్టు ఆరోపిస్తుంది. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా పైక్రాఫ్ట్‌పై మాటల డోసును పెంచాడు. ఉర్దూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పైక్రాఫ్ట్ ప్రవర్తనను “అస్పోర్ట్స్‌మన్‌షిప్”గా అభివర్ణించాడు.
మొత్తంగా చూస్తే షేక్ హ్యాండ్ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తుంది. భారత్-పాక్ ఇదే టోర్నీలో మరోసారి (సూపర్-4) తలపడాల్సి ఉంది. సెప్టెంబర్ 21న జరిగే ఆ మ్యాచ్‌లో కూడా భారత ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ పాలసీని కొనసాగిస్తారని తెలుస్తుంది. ఈ వివాదం రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసేలా ఉంది.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాకిస్తాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 127 పరుగులకే పరిమితం కాగా.. భారత్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.