
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో ఓటమి అంచుల నుంచి తప్పించుకొని మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’గా ముగించడంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. రెండో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా... తర్వాతి ఐదు సెషన్లలో మరో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ప్రత్యర్ధిని నిలువరించగలిగింది. ఇది మన జట్టు పట్టుదలను చూపించింది.
మాది ఒక గొప్ప జట్టు..
ఈ విషయాన్ని భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఉన్న తేడాను తాము చూపించగలిగామని అతను చెప్పాడు. ‘మైదానంలో 143 ఓవర్ల పాటు ఒకే లక్ష్యంతో ఒకే తరహా ఆలోచనతో మానసికంగా దృఢంగా ఉండటం చాలా కష్టం. కానీ మేం దానిని చేసి చూపించాం. ఒక మంచి జట్టుకు, గొప్ప జట్టుకు మధ్య ఇదే ప్రధాన తేడా. ఈ టెస్టులో ఆటతో మాది గొప్ప జట్టని నిరూపించాం’ అని గిల్ వ్యాఖ్యానించాడు.
సున్నాకే 2 వికెట్లు కోల్పోయిన దశలో సీనియర్ కేఎల్ రాహుల్‌తో కలిసి గిల్ నెలకొల్పిన భాగస్వామ్యమే జట్టు రాతను మార్చింది. 70.3 ఓవర్ల వీరి భాగస్వామ్యంలో 188 పరుగులు వచ్చాయి. ఈ పార్ట్‌నర్‌షిప్‌తోనే తాము మ్యాచ్‌ను కాపాడుకోగలమనే నమ్మకం కలిగిందని గిల్ చెప్పాడు.
‘మా జట్టు పట్టుదలగా ముందుకు వెళ్లాలంటే కావాల్సిన అగ్గిని రగిల్చేందుకు ఒక నిప్పు కణిక అవసరమైంది. నేను, రాహుల్ కలిసి నెలకొల్పిన భాగస్వామ్యం అలాంటిదే. మేం పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోగలమని అప్పుడే అనిపించింది. తుది ఫలితం చాలా సంతోషాన్నిచ్చింది. శనివారం మేం ఉన్న స్థితితో పోలిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ఎంతో సంతృప్తికరం. నా ఇన్నింగ్స్ పట్ల కూడా ఎంతో ఆనందంగా ఉన్నా’ అని గిల్ పేర్కొన్నాడు.
భారత్ ఓటమి నుంచి తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించిన జడేజా, సుందర్‌లపై కూడా కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరు 55.2 ఓవర్లు ఆడి అభేద్యంగా 203 పరుగులు జత చేశారు. ‘జడేజా, సుందర్ క్రీజ్‌లో ఉన్నప్పుడు కూడా బ్యాటింగ్‌కు అంత అనుకూల పరిస్థితి ఏమీ లేదు.
బంతి అనూహ్యంగా స్పందిస్తోంది. కానీ అలాంటి స్థితి నుంచి ప్రశాంతంగా ఆడుతూ ఇద్దరూ సెంచరీలు సాధించడం చాలా గొప్ప విషయం. ఏకాగ్రత చెదరకుండా ప్రతీ బంతిపై వారు దృష్టి పెట్టి డ్రా వరకు తీసుకెళ్లడం ఎంతో ప్రత్యేకం. ఇది మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అని గిల్ అన్నాడు.
చదవండి: IND vs PAK: ‘పాక్‌తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం