శీతల్‌కు పాయల్‌ షాక్‌! | Para archer Sheetal Devi suffers unexpected defeat | Sakshi
Sakshi News home page

శీతల్‌కు పాయల్‌ షాక్‌!

Apr 5 2026 4:02 AM | Updated on Apr 5 2026 4:02 AM

Para archer Sheetal Devi suffers unexpected defeat

వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌

బ్యాంకాక్‌: వరల్డ్‌ ఆర్చరీ పారా సిరీస్‌లో భారత జట్టు 7 స్వర్ణాలు సహా మొత్తం 16 పతకాలు సాధించి అగ్రస్థానంతో ముగించింది. అయితే టోర్నీలో సంచలన ప్రదర్శన చివరి రోజు శనివారం వచ్చింది. కాంపౌండ్‌ మహిళల ఫైనల్‌ విభాగంలో వరల్డ్‌ నంబర్‌వన్, స్టార్‌ పారా ఆర్చర్‌ శీతల్‌దేవికి అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ పోరులో భారత్‌కే చెందిన పాయల్‌ నాగ్‌ 139–136 స్కోరుతో శీతల్‌పై విజయం సాధించింది. 

గత ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా యూత్‌ పారా గేమ్స్‌లో పాల్గొన్న పాయల్‌కు ఇది రెండో అంతర్జాతీయ టోర్నీ మాత్రమే. ఓపెనింగ్‌ ఎండ్‌లో పాయల్‌ 27–25తో ముందంజ వేయగా, సెకండ్‌ ఎండ్‌ ముగిసే సరికి శీతల్‌ రాణించడంతో స్కోరు 54–54తో సమమైంది. 

అయితే చివరి ఎండ్‌లో మళ్లీ సత్తా చాటిన పాయల్‌ పైచేయి సాధించింది. ఒడిషాలోని బాలాంగిర్‌కు చెందిన పాయల్‌  కరెంట్‌ షాక్‌ కారణంగా రెండు చేతులు, రెండు కాళ్ల మోకాలి కింది భాగాలు కోల్పోయింది. ఏడాదిన్నర క్రితం జైపూర్‌లో జరిగిన జాతీయ పారా నేషనల్స్‌లో కూడా శీతల్‌పై పాయల్‌ గెలుపొందింది. 

Advertisement
 
Advertisement
Advertisement