ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం | DC VS MI: A Rare Incident in IPL 2026 | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టం

Apr 4 2026 7:44 PM | Updated on Apr 4 2026 8:07 PM

DC VS MI: A Rare Incident in IPL 2026

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) మధ్యాహ్నం (3:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఓ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడగా.. ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఢిల్లీ మరో 11 బంతులు మిగిలుండగానే (18.1 ఓవర్లు) 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమీర్‌ రిజ్వి (90) వరుసగా రెండో మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీని గెలిపించాడు.

అంతకుముందు లక్నోపై కూడా రిజ్వి (70 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ​్‌ ఇన్నింగ్స్‌ ఆడి ఢిల్లీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ముంబైపై తాజా హాఫ్‌ సెంచరీ రిజ్వికి ఐపీఎల్‌లో వరుసగా మూడవది. గత ఎడిషన్‌ చివరి మ్యాచ్‌లోనూ (పంజాబ్‌) అతను అజేయ హాఫ్‌ సెంచరీ (58) సాధించాడు.

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ ఓ అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది. ఢిల్లీ లక్ష్యానికి చేరువైన తరుణంలో (16.4వ ఓవర్‌) స్ట్రయికర్‌ (మిల్లర్‌), నాన్‌ స్ట్రయికర్‌ (ట్రిస్టన్‌ స్టబ్స్‌), బౌలర్‌ (కార్బిన్‌ బాష్‌), వికెట్‌కీపర్‌ (ర్యాన్‌ రికెల్టన్‌, ముంబై) నలుగురూ సౌతాఫ్రికన్లే ఉన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌ చరిత్రలో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది.

గతంలో ఒకే దేశానికి చెందిన నలుగురు ఇలా వేర్వేరు పోజిషన్లలో ఆడిన దాఖలాలు ఇప్పటివరకు రికార్డు కాలేదు. ఒకవేళ ఇలాంటి ఘట్టాలు ఎక్కడైనా నమోదైనా, సౌతాఫ్రికన్లు ఆ నాలుగు పోజిషన్లలో ఉండి ఉండే అవకాశం మాత్రం లేదు. ఫ్రాంచైజీ లీగ్‌ పుణ్యమా అని ఇలాంటి సిత్రాలన్నీ జరుగుతూ ఉంటాయి. 

Advertisement
 
Advertisement
Advertisement