ఐపీఎల్ ద్వారా మరో భారత టాలెంట్ బయటపడింది. 2026 ఎడిషన్‌లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 4) రాత్రి (7:30 గంటలకు) ప్రారంభమైన మ్యాచ్‌లో ఓ అద్భుతం జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు చెందిన అనామక బౌలర్ అశోక్ శర్మ నిప్పులు చెరిగాడు. ఊహించని విధంగా గంటకు 154 కిమీ వేగంతో బౌలింగ్ చేశాడు.
ఐపీఎల్ 2026లో ఇప్పటివరకు ఇదే అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ చివరి బంతికి అశోక్ మెరుపు వేగంతో బంతిని సంధించాడు. ఈ బంతిని ఎదుర్కొన్న ధృవ్ జురెల్ పరుగు సాధించలేకపోయాడు.
ప్రస్తుత సీజన్‌లో అశోక్ శర్మ తర్వాత అత్యంత వేగవంతమైన బంతి లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అన్రిచ్ నోర్జే (150.9) పేరిట ఉంది. ఆతర్వాతి స్థానాల్లో కార్తీక్ త్యాగి (149.7), రబాడ (149.1), ఓవర్టన్ (145.6) ఉన్నారు.
ఓవరాల్‌గా ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతి షాన్ టైట్ పేరిట ఉంది. 2011 ఎడిషన్‌లో ఇతను రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతూ ఢిల్లీ డేర్ డెవిల్స్‌పై ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో టాప్-5 వేగవంతమైన బంతులు ఇలా ఉన్నాయి.
157.71 కిమీ/గం - షాన్ టైట్ (2011)
157.4 కిమీ/గం - గెరాల్డ్ కోయెట్జీ (2024)
157.3 కిమీ/గం - లాకీ ఫెర్గూసన్ (2022)
157.0 కిమీ/గం - ఉమ్రాన్ మాలిక్ (2022)
156.22 కిమీ/గం - అన్రిచ్ నోర్ట్జే (2020)
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. జురెల్ (75), జైస్వాల్ (55) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (31) పర్వాలేదనిపించాడు.
మిగతా ఆటగాళ్లలో రియాన్ పరాగ్ 4, హెట్‌మైర్ 18, డొనొవన్ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్ బౌలర్లలో రబాడ 2, సిరాజ్, అశోక్ శర్మ, ప్రసిద్ద్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనను గుజరాత్ కూడా ధాటిగానే ప్రారంభించింది. 7.1 ఓవర్లలోనే ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (47) చెలరేగి ఆడుతున్నాడు. అతనికి కుమార్ కుషాగ్రా (18) అండగా ఉన్నాడు.


