ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై రాయల్స్‌ గెలుపు | IPL 2026: Rajasthan royals beat gujarat titans by 6 runs | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ పోరులో గుజరాత్‌పై రాయల్స్‌ గెలుపు

Apr 4 2026 11:42 PM | Updated on Apr 4 2026 11:42 PM

IPL 2026: Rajasthan royals beat gujarat titans by 6 runs

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 4) రాత్రి (7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై రాజస్తాన్‌ రాయల్స్‌ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ సమరంలో గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనను దూకుడుగా ప్రారంభించిన గుజరాత్‌.. మధ్యలో ఒక్కసారిగా లయ తప్పి స్వల్ప వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రబాడ, రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌కు గెలుపుపై ఆశలు కలిగించి, ఆఖర్లో చేతులెత్తేశారు. 

చివరి ఓవర్‌లో వీరు గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. తుషార్‌ దేశ్‌పాండే అద్భుతంగా బౌలింగ్‌ చేసి వీరిని కట్టడి చేశాడు. ఫలితంగా గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసి, లక్ష్యానికి 7 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాయల్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ మధ్య ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేసి స్వల్ప వ్యవధిలో 4 వికెట్లతో గుజరాత్‌ నడ్డి విరిచాడు. ఫలితంగా గుజరాత్‌కు సొంతగడ్డపై పరాభవం తప్పలేదు.

చెలరేగిన జురెల్‌, జైస్వాల్‌
తొలుత బ్యాటింగ్‌లో ధృవ్‌ జురెల్‌ (75), యశస్వి జైస్వాల్‌ (55) అర్ద సెంచరీలతో చెలరేగడంతో రాయల్స్‌ భారీ స్కోర్‌ చేసింది. వైభవ్‌ సూర్యవంశీ (31) సైతం మెరుపులు మెరిపించి ఔటయ్యాడు. మిగతా ఆటగాళ్లలో రియాన్‌ పరాగ్‌ 4, హెట్‌మైర్‌ 18, డొనొవన్‌ ఫెరియెరా ఒక పరుగు చేసి ఔట్‌ కాగా.. రవీంద్ర జడేజా (7), జోఫ్రా ఆర్చర్‌ (1) అజేయంగా నిలిచారు. గుజరాత్‌ బౌలర్లలో రబాడ 2, సిరాజ్‌, అశోక్‌ శర్మ, ప్రసిద్ద్‌ కృష్ణ, రషీద్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీశారు.

రాయల్స్‌ను భయపెట్టిన సాయి సుదర్శన్‌
భారీ ఛేదనను గుజరాత్‌ ఓపెనర్‌ ధాటిగా ప్రారంభించాడు. 44 బంతుల్లో 73 పరుగులు చేసి రాయల్స్‌ శిబిరంలో భయాన్ని రేకెత్తించాడు. అయితే ఇతను ఔటయ్యాక పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. బిష్ణోయ్‌ దెబ్బకు గుజరాత్‌ మిడిలార్డర్‌ పేకమేడలా కూలింది. బట్లర్‌ (26), రషీద్‌ ఖాన్‌ (24), రబాడ (23 నాటౌట్‌) పోరాడి చేతులెత్తేశారు. రాయల్స్‌ బౌలర్లలో బిష్ణోయ్‌ 4, బర్గర్‌, తుషార్‌ దేశ్‌పాండే, రియాన్‌ పరాగ్‌ తలో వికెట్‌ తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement