ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కొనసాగుతున్నాడు. గతేడాది మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని ఏకంగా రూ. 27 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే, పంత్ మాత్రం ఈ ధరకు ఏమాత్రం న్యాయం చేయడం లేదు.
వైఫల్యాల పరంపర
గతేడాది 13 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 269 పరుగులు చేశాడు పంత్ (Rishabh Pant). సారథిగా జట్టును ఏడో స్థానంలో నిలిపాడు. ఇక ఈ ఏడాది అతడి ప్రదర్శన మరింత ఘోరంగా ఉంది. ఇప్పటికి ఎనిమిది ఇన్నింగ్స్‌లో కలిపి 189 పరుగులే చేశాడు పంత్. ఇక లక్నో ఎనిమిదింట కేవలం రెండు గెలిచి అట్టడుగున పదో స్థానంలో కొనసాగుతోంది.
భవిష్యత్ ప్రశ్నార్థకం
ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. టీ20 ప్రపంచకప్-2024లో ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన పంత్‌కు.. 2026 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 2024లో చివరి టీ20 ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. అదే ఏడాది ఆఖరిగా వన్డే ఆడాడు.
పంత్‌పై వేటు.. సంజూకు చోటు!
తాజాగా ఐపీఎల్‌లోనూ వైఫల్యాల నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్-2027 జట్టు ఎంపికలో పంత్ పేరును కూడా కనీసం పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకుండా పోయినట్లయింది. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. వన్డేల్లో కేఎల్ రాహుల్‌కు బ్యాకప్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్‌ను ఎంపిక చేయాలని సెలక్షన్ కమిటీ ఫిక్సైంది.
ధ్రువ్ జురెల్ కూడా..
ఇక ఈ రేసులో ధ్రువ్ జురెల్ కూడా మరో పోటీదారుడిగా ఉన్నాడు. కాగా సంజూ టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. నాకౌట్ మ్యాచ్‌లలో సత్తా చాటి టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించి.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలిచాడు. ఐపీఎల్-2026లో ఇప్పటికే రెండు సెంచరీలు బాది సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో సంజూకు వన్డేల్లోనూ పెద్దపీట వేయాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా సంజూ విషయంలో సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. కాగా 2027 వరల్డ్‌కప్ టోర్నీకి ముందు టీమిండియా 20 వన్డేలు ఆడాల్సి ఉంది.
ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు జూన్ 14 నుంచి అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ మొతలుపెట్టనున్నారు. ఇక పరిమిత ఓవర్ల జట్టులో స్థానం గల్లంతైనప్పటికీ.. టెస్టుల్లో మాత్రం పంత్ చోటుకు ఢోకా ఏమీలేదు.
చదవండి: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు


