పంత్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ | Rishabh Pant Return To India After Test Injury, Meets Specialist In Mumbai, Insta Post Goes Viral | Sakshi
Sakshi News home page

పంత్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌

Sep 9 2025 9:14 AM | Updated on Sep 9 2025 10:34 AM

Pant return to India, meets specialist in Mumbai

టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చింది. ఇటీవల (జులై 23న) ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన పంత్‌.. నెలకు పైగా ఇంగ్లండ్‌లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుని కొద్ది రోజుల కిందటే భారత్‌కు తిరిగి వచ్చాడు. ముంబైలో వైద్య నిపుణులను సంప్రదించిన అనంతరం, వారి సలహా మేరకు త్వరలోనే నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE) పునరావాస శిబిరంలో చేరనున్నాడు.

అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌ సమయానికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్న పంత్‌.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పంత్‌కు గాయం పూర్తిగా తగ్గలేదని తెలుస్తుంది. వైద్యులు అతనికి తిరిగి ఫిట్‌నెస్ సాధించేందుకు టైమ్‌లైన్ ఇచ్చినట్లు సమాచారం.

టెండూల్కర్‌-ఆండర్సన్‌ ట్రోఫీ 2025లో భాగంగా మాంచెస్టర్‌ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్‌లో పంత్‌ తొలి రోజు ఆటలో క్రిస్‌ వోక్స్‌ బౌలింగ్‌లో గాయపడ్డాడు. వోక్స్‌ సంబంధించిన బంతి పంత్‌ పాదానికి తీవ్ర గాయం చేసింది. నొప్పితో విలవిలలాడిన పంత్‌ అప్పుడు మైదానాన్ని వీడి, జట్టు అవసరాల దృష్ట్యా కుంటుతూనే రెండో రోజు బ్యాటింగ్‌కు దిగాడు.

తొలి రోజు గాయపడిన సమయానికి 37 పరుగుల వద్ద ఉండిన పంత్‌.. రెండో రోజు తిరిగి బరిలోకి దిగి జట్టుకు చాలా ముఖ్యమైన 17 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ గాయం కారణంగా పంత్‌ ఓవల్‌లో జరిగిన ఐదో టెస్ట్‌ దూరమయ్యాడు. ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.

పంత్‌ పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకుని అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ టెస్ట్ సిరీస్ సమయానికంతా రెడీగా ఉండాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే CoEలోని రీహ్యాబ్‌లో చేరనున్నాడు. ఒకవేళ విండీస్‌తో సిరీస్‌ సమయానికి పూర్తిగా కోలుకోకపోతే, తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే వైట్-బాల్ సిరీస్‌ సమయానికైనా పునారగమనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాడు.

పంత్‌ భావోద్వేగ పోస్ట్
తాజాగా పంత్‌ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశాడు. ఎంత బాధను గతంలో అనుభవించినా, మళ్లీ గాయపడితే అదే స్థాయిలో బాధ కలుగుతుంది. అయితే రెండో సారి మన సహనశక్తి పెరుగుతుంది. ఇదే మనల్ని బలంగా మారుస్తుందని తన ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. 

కాగా, 2022లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రగాయాలపాలై, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆ స్థాయి గాయాలు కాకపోయినా పంత్‌ మరోసారి గాయపడ్డాడు. ఫలితంగా మరోమారు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత టీ20 జట్టు ఆసియా కప్‌ కోసం యూఏఈలో పర్యటిస్తుంది. ఈ జట్టులో వికెట్‌కీపర్లుగా సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement