
మహిళల వన్డే ప్రపంచ కప్ ఓపెనింగ్ సెర్మనీ కోసం పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు గౌహతిలోని బార్సపరా స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగాల్సి ఉన్నాయి. ఇందు కోసం టోర్నీలో పాల్గొనే జట్లన్నీ హాజరుకానున్నాయి. అయితే భారత్‌తో సత్సంబంధాలు లేని కారణంగా పాక్ ఈ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఓపెనింగ్ సెర్మనీలో ప్రముఖ బాలీవుడ్ గాయని శ్రేయా ఘోసల్‌తో లైవ్ పెర్ఫార్మెన్స్ ఏర్పాటు చేయబడింది. ఈ వేడుకను ఐసీసీ గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఓపెనింగ్ సెర్మనీ అనంతరం కెప్టెన్ల ఫోటో షూట్, ప్రత్యేక మీడియా సమావేశం కూడా జరునున్నాయి. వీటికి కూడా పాక్ దూరం కానుందని సమాచారం.
భారత్–పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 2008 నుంచి నిలిచిపోయిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. బీసీసీఐ-పీసీబీ ఒప్పందం మేరకు ఇరు జట్లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడనున్నాయి. అది కూడా తటస్ట్ వేదికల్లో మాత్రమే.
త్వరలో ప్రారంభం కాబోయే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ తమ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది. ఆ జట్టు అక్టోబర్ 2న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అక్టోబర్ 5న కొలొంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది.