
ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు ఓ పాకిస్తానీ క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. పాక్ తరఫున ఓ టెస్ట్, 17 వన్డేలు, 16 టీ20లు ఆడిన 31 ఏళ్ల ఉస్మాన్ షిన్వారీ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన షిన్వారీ టెస్ట్‌ల్లో ఒకటి, వన్డేల్లో 34, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు.
2013లో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన షిన్వారీ, 2019లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ తర్వాత పాక్ జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. ఈ మధ్యలో ఆరేళ్లు జాతీయ జట్టుకు దూరంగా ఉన్న అతను, తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
షిన్వారీకి స్వల్ప కెరీర్‌లోనే ఓ ప్రత్యేకత ఉంది. అతనాడిన 17 వన్డేల్లోనే రెండు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. ఇంత స్వల్ప కెరీర్‌లో ఇలా చాలా అరుదుగా జరుగుతుంది. షిన్వారీ 2018 ఆసియా కప్ ఆడిన పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
అయితే ఆ ఎడిషన్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో అతను ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. హాంగ్‌కాంగ్‌పై మాత్రం మూడు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ ఏడాది మధ్య వరకు దేశవాలీ క్రికెట్‌లో కొనసాగిన షిన్వారీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్‌ల్లో పాల్గొన్నాడు.