
ఆసియా కప్-2025లో భాగంగా భారత్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య చోటు చేసుకున్న 'హ్యాండ్‌షేక్ వివాదం' తీవ్రరూపం దాల్చినట్లు కనిపిస్తుంది. పాక్ క్రికెట్ టీమ్ ఇవాళ (సెప్టెంబర్ 17) యూఏఈతో జరుగబోయే మ్యాచ్ సహా ఆసియా కప్ మొత్తాన్ని బాయ్‌కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
యూఏఈతో మ్యాచ్ ప్రారంభానికి గంట సమయం మాత్రమే ఉన్నా, పాక్ క్రికెటర్లు ఇంకా హోటల్ రూమ్‌ల నుంచి బయటికి రాలేదని సమాచారం. హ్యాండ్‌షేక్ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ కాసేపట్లో పాక్ నుంచి మీడియా సమావేశం నిర్వహిస్తాడని తెలుస్తుంది.
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సెప్టెంబర్ 14న జరిగిన మ్యాచ్ సందర్భంగా భారత క్రికెటర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీన్ని అవమానంగా భావించిన పాక్.. భారత ఆటగాళ్లపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
అలాగే ఆ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన ఆండీ పైక్రాఫ్ట్‌ను ఆసియా కప్ నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది. పైక్రాఫ్ట్ షేక్‌హ్యాండ్ ఇవ్వొద్దని తమ కెప్టెన్ సల్మాన్ అఘాకు చెప్పాడని, ఈ వివాదానికి అతనే బాధ్యుడని పీసీబీ గగ్గోలు పెడుతుంది.
పీసీబీ డిమాండ్లను పరిశీలించిన ఐసీసీ.. షేక్ హ్యాండ్ ఇవ్వడమనేది ఆటగాళ్ల వ్యక్తిగత విషయమని కొట్టిపారేసింది. అలాగే షేక్‌హ్యాండ్ ఉదంతంలో పైక్రాఫ్ట్ పాత్ర ఏమీ లేదని యూఏఈతో మ్యాచ్‌కు అతన్నే రిఫరీగా కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.
ఐసీసీ నిర్ణయాలతో ఖంగుతిన్న పీసీబీ చేసేదేమీ లేక ఆసియా కప్‌ను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో ముందు దశకు (సూపర్-4) వెళ్లాలంటే పాక్ యూఏఈపై తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. గ్రూప్-ఏలో పాక్ పసికూన ఒమన్‌పై విజయం సాధించి, టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది. మరోవైపు యూఏఈ టీమిండియా చేతిలో ఓడి, ఒమన్‌పై విజయం సాధించింది.
ప్రస్తుతం పాక్, యూఏఈ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయంతో పాయింట్ల పట్టికలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఒకవేళ పాక్ యూఏఈతో మ్యాచ్‌ను బహిష్కరిస్తే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇదే జరిగితే యూఏఈ భారత్‌తో పాటు సూపర్-4కు చేరుకుంటుంది.