PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! | Pakistan Super League 1st Match Turns Into Pink Ball Contest Viral | Sakshi
Sakshi News home page

PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం!

Mar 27 2026 8:50 AM | Updated on Mar 27 2026 10:05 AM

Pakistan Super League 1st Match Turns Into Pink Ball Contest Viral

ఆంక్ష‌ల న‌డుమ మొదలైన పాకిస్థాన్ సూప‌ర్‌లీగ్ (పీఎస్ఎల్‌) 2026 సీజ‌న్ తొలిరోజునే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లాహోర్ ఖ‌లంద‌ర్స్ ఇన్నింగ్స్ 15వ ఓవ‌ర్ సంద‌ర్భంగా బంతి రంగు మార‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. సాధార‌ణంగా ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో వైట్‌బాల్‌ను ఉప‌యోగించ‌డం ఆన‌వాయితీ. అయితే అనూహ్యంగా బంతి గులాబీ రంగులోకి మారిపోయింది.  ఇది ఎలా జ‌రిగిందో అర్థం కాక ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఆశ్చ‌ర్యానికి లోన‌య్యారు. 

ఓవ‌ర్ ముగిసిన త‌ర్వాత  బంతిని ప‌రిశీలించిన  అంపైర్లు దాని స్థానంలో మ‌రొక బంతిని తీసుకొని మ్యాచ్‌ను కొన‌సాగించారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్య‌క్తి సామాజిక మాధ్య‌మంలో షేర్ చేసుకోవ‌డంతో ఉన్న‌ప‌ళంగా వైరల్‌గా మారిపోయింది. క్రీడాభిమానులు సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ కామెంట్ల‌తో రెచ్చిపోయారు. 

'బౌల‌ర్లు ప‌దేప‌దే బంతిని రుద్ద‌డం వ‌ల్లే తెల్ల‌బంతి కాస్తా గులాబీ రంగుకు మారిపోయి ఉంటుంది'.. 'ఇది పీఎస్ఎల్ కాదు పైసా షార్టేజ్ లీగ్ అనుకుంటా'.. 'ఇది అంత‌ర్జాతీయ క్రికెటా లేక గ‌ల్లీ క్రికెటా అన్న‌ది అర్థం కావ‌డం లేదు'.. అని కామెంట్లు చేశారు. ప్రేక్ష‌కులు లేకుండానే మొదలైన పీఎస్‌ఎల్‌లో తొలి మ్యాచ్‌ షహీన్‌ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలంద‌ర్స్‌, ల‌బుషేన్ నేతృ త్వంలోని హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ మ‌ధ్య మ్యాచ్ జ‌రిగింది. 

ఈ మ్యాచ్‌లో లాహోర్ ఖ‌లంద‌ర్స్ 69 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖ‌లంద‌ర్స్ 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్ (53) అర్థ‌సెంచ‌రీతో రాణించ‌గా, హ‌సీబుల్లా ఖాన్ (40 నాటౌట్‌) చివ‌ర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  హైదరాబాద్ కింగ్స్ బౌల‌ర్ల‌లో రిలే మెరిడిత్‌, హ‌స‌న్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు ప‌డ‌గొట్టారు. 

అనంత‌రం బ్యాటింగ్‌కు దిగిన హైద‌రాబాద్ కింగ్స్‌మెన్ 20 ఓవ‌ర్ల‌లో 130 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కెప్టెన్ ల‌బుషేన్ (26) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. లాహోర్ ఖ‌లంద‌ర్స్ బౌల‌ర్ల‌లో హారిస్ ర‌వూఫ్‌, సికంద‌ర్ ర‌జా, ఉబైద్ షా త‌లా రెండు వికెట్లు తీశారు. నేడు జ‌ర‌గనున్న మ్యాచ్‌లో క్వెటా గ్లాడియేట‌ర్స్‌, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

చదవండి: ధోనిపై మాజీ ఆట‌గాడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement