పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షాహిన్ ఆఫ్రిదిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆటపై దృష్టి పెట్టకుండా.. ఇతర అంశాల్లో దూరడం ఎందుకంటూ సొంత జట్టు అభిమానులే మండిపడుతున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) తీరును కూడా ఎండగడుతున్నారు. పాక్ మరో ఆటగాడు నసీం షా విషయంలో వ్యవహరించినట్లే షాహిన్ విషయంలోనూ కఠిన చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.
పాక్ చేసిన పని వల్ల గందరగోళం
అసలేం జరిగిందంటే.. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం విదితమే. ఇప్పటికే పరస్పర దాడుల వల్ల మూడు దేశాలు ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపోతున్నాయి. ఇరాన్ అగ్ర నాయత్వాన్ని దాదాపుగా మట్టుబెట్టామని అమెరికా చెబుతోంది.
అయితే, ఈ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై పడింది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల చమురు సంక్షోభం తలెత్తింది. ఇలాంటి తరుణంలో కాల్పుల విరమణ ఒప్పందానికి తాము మధ్యవర్తిత్వం వహిస్తున్నామని పాకిస్తాన్ తెరమీదకు వచ్చింది.
కానీ ఇక్కడా పాక్ చేసిన పని వల్ల గందరగోళం నెలకొంది. తమ భూభాగంతోపాట లెబనాన్ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్ స్పష్టంగా ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి పాకిస్తాన్ ‘లెబనాన్’అనే పేరును తొలగించి.. అమెరికా, ఇజ్రాయెల్‌లకు చేరవేసిందని ఆరోపణలు వస్తున్నాయి.
విమర్శల వర్షం
లెబనాన్‌పై అమెరికా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యవర్తిగా పాక్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాక్ ద్వంద్వ వైఖరిపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ అయితే ఏకంగా మధ్యవర్తిత్వం విషయంలో పాక్ ఎంతమాత్రం నమ్మదగిన దేశం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.
ప్రపంచ శాంతికి కృషి.. పాకిస్తానీగా గర్విస్తున్నా
ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. ‘‘ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ నాయకత్వం వహిస్తూ ముందుకు సాగుతున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. మా ప్రధాని షాబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌లు శాంతి చర్చలకు ఊతమిచ్చారు.
సంక్షోభం నుంచి స్థిరత్వం వైపు అడుగులు వేసేలా చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా మానవత్వం పరిఢవిల్లుతుంది. ఇందుకు పాకిస్తాన్ గొప్ప ముందడుగు వేసింది. శాంతి కోసం కృషి చేస్తోంది. పాకిస్తానీగా ఉన్నందుకు గర్వపడుతున్నా’’ అంటూ షాహిన్ ఓవరాక్షన్ చేశాడు.
ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం
ఓవైపు.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంపై విమర్శలు, ఆరోపణలు వస్తున్న వేళ షాహిన్ ఆఫ్రిది ఇలా సొంతడబ్బా కొట్టుకున్నట్లుగా ట్వీట్ చేయడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆటను వదిలి ఇతర అంశాల్లో జోక్యం చేసుకోవడం అవసరమా? అని మండిపడుతున్నారు.
కాగా ఇటీవల పాక్ పేసర్ నసీం షా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరంభ వేడుకల్లో పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌ను రాణిలా ట్రీట్ చేశారంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఇతర అంశాల్లో జోక్యం చేసుకున్నందున పీసీబీ అతడికి రూ. 2 కోట్ల (పాక్ కరెన్సీ) జరిమానా విధించింది.
మరి ఇప్పుడు షాహిన్ కూడా పీసీబీ ఇలాగే శిక్షిస్తుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కాగా ఇటీవల షాహిన్ కెప్టెన్సీలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. బంగ్లాదేశ్ పర్యటనలో దాదాపు పదకొండేళ్ల తర్వాత తొలిసారి ఆతిథ్య జట్టుకు వన్డే సిరీస్ కోల్పోయింది.


