‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్‌దే! | Pakistan to blame for Lebanon confusion in US-Iran ceasefire | Sakshi
Sakshi News home page

‘కాల్పుల విరమణ’ గందరగోళం పాపం పాక్‌దే!

Apr 10 2026 5:34 AM | Updated on Apr 10 2026 5:34 AM

Pakistan to blame for Lebanon confusion in US-Iran ceasefire

కాల్పుల విరమణ ఇరాన్‌ ప్రతిపాదనల్లో లెబనాన్‌ పేరును తొలగించి అమెరికాకు పంపిన పాకిస్తాన్‌ 

ఆ తర్వాత పేరు చేర్చి ప్రకటన చేసిన షెహబాజ్‌ షరీఫ్‌ 

భిన్న వైఖరిపై వెల్లువెత్తుతున్న విమర్శలు

మధ్యవర్తి అంటే పెద్దమనిషి తరహాలో పెద్దరికంతో, హుందాగా వ్యవహరించాలి. కానీ దశాబ్దాలుగా ఉగ్రమూకలను చంకనెత్తుకు తిరుగుతూ తమ దేశంలో ఉగ్రవాదమే లేదని బొంకే పాకిస్తాన్‌ అంతర్జాతీయ వేదికలపైనా అదే ధోరణిని ప్రదర్శించి మరోసారి నవ్వులపాలైంది. ఇందుకు పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ మధ్య తెరమీదకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనల ఘటనే సాక్ష్యంగా నిలిచింది. 

తమ భూభాగంతోపాట లెబనాన్‌ మీదా దాడులను ఆపేయాలని ఇరాన్‌ స్పష్టంగా పది ప్రతిపాదనలను పంపితే వాటిలోంచి ‘లెబనాన్‌’అనే పేరును తొలగించి అమెరికా, ఇజ్రాయెల్‌లకు పాకిస్తాన్‌ ప్రతిపాదనలను చేరవేసిందనేది ఇప్పుడు విన్పిస్తున్న ప్రధాన ఆరోపణ. పాక్‌ మధ్యవర్తిత్వంలో తమకు అందిన ప్రతిపాదనల్లో ‘లెబనాన్‌’అనే పదం ఎక్కడా లేదనేది అమెరికా, ఇజ్రాయెల్‌ వాదన. దీంతో పాకిస్తాన్‌ చేసిన అసమర్థ, అసంబద్ధ మధ్యవర్తిత్వం కారణంగా తమపై దాడులభారం తప్పట్లేదని ఇప్పుడు లెబనాన్‌ పాక్‌పై ఆగ్రహంగా ఉంది. పాక్‌ మాత్రం దీంతో తమకెలాంటి సంబంధంలేదని చేతులు దులిపేసుకునేలా మాట్లాడటం గమనార్హం.

 ‘‘లెబనాన్‌తో కలుపుకుని ప్రతిచోటా, ఎక్కడా దాడులు జరపబోమని ఇరాన్, అమెరికా, మిత్రదేశాల మధ్య కాల్పుల విరమణ ప్రతిపాదన అమల్లోకి వచ్చింది’’అని తొలుత ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ‘ఎక్స్‌’లో ఒక ట్వీట్‌చేశారు. ట్వీట్‌చేసిన కొద్దిసేపటికే లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భీకరదాడులు చేయడంతో కాల్పులవిరమణ ఒప్పందంలో లెబనాన్‌ పేరు ఉందా? లేదా? అనే గందరగోళం తలెత్తింది. ఇందుకు పాకిస్తానే కారణమని లెబనాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. 

ఇరాన్‌ పంపిన ప్రతిపాదనలకు పాకిస్తాన్‌ ఏకపక్షంగా సవరణలుచేసి అమెరికాకు పంపిందని ఆరోపించింది. ఇరాన్‌ సైతం ఇదే వాదనలు చేసింది. తాము పంపిన వాటిని మార్చేసి అమెరికాకు పంపడంతోపాటు, అమెరికా పంపిన ప్రతిపాదనలనూ కాస్తంత అటూఇటూ మార్చేసి తమకు అందజేసిందని ఇరాన్‌ ఆరోపిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ సైతం పాకిస్తాన్‌ రెండు నాల్కల ధోరణిని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘సీజ్‌ఫైర్‌లో లెబనాన్‌ ఉందని ఇరాన్‌ను మధ్యవర్తిత్వ దేశాలు నమ్మించి ఉండవచ్చు. ఇందులో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. లెబనాన్‌పై దాడి చేయబోమనే ప్రతిపాదనలకు మేం సమ్మతి తెలపలేదు’’అని అన్నారు.  

ట్వీట్‌ సైతం అమెరికా నుంచే.. 
షెహబాజ్‌ షరీఫ్‌ ‘ఎక్స్‌’ఖాతాలో ప్రత్యక్షమై ట్వీట్‌ సైతం సొంతంగా టైప్‌ చేసింది కాదు అని, అమెరికా అధ్యక్షభవనం నుంచి వచ్చిన సందేశాన్నే ఉన్నది ఉన్నట్లుగా షరీఫ్‌ తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్ట్‌చేశారని తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక కథనం ప్రచురించింది. సందేశం మీద తొలుత డ్రాఫ్ట్‌ అనే పదం కన్పించి తర్వాత అది కన్పించకుండా పోయింది. షరీఫ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌చేయబోయే వాక్యాలను తొలుత శ్వేతసౌధం ధ్రువీకరించిందని, వైట్‌హౌస్‌ అనుమతితోనే షరీఫ్‌ ఆ సందేశాన్ని పోస్ట్‌చేశారని న్యూయార్క్‌టైమ్స్‌ పేర్కొంది. దీనిపై పాకిస్తాన్‌ నుంచి ఎలాంటి ఖండన రాకపోవడంతో ఇదే వాస్తవమనే వాదనకు బలం చేకూరింది. ఒక పక్షం వాదనలు, డిమాండ్లను అత్యంత పారదర్శకంగా మరో పక్షానికి అందించడంలో పాకిస్తాన్‌ విఫలమైందని, అందుకే లెబనాన్‌ విషయంలో సందిగ్ధత చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement