
ఆసియాకప్-2025కు రంగం సిద్దమైంది. అబుదాబి వేదికగా మరి కొన్ని గంటల్లో అఫ్గానిస్తాన్-యూఏఈ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ ఖండాంతర టోర్నమెంట్ ఆరంభానికి ముందు మొత్తం 8 జట్ల కెప్టెన్‌లు విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు.ఈ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ జట్టులో లేకపోవడం తమకు ఎటువంటి నష్టం కలిగించదు సల్మాన్ చెప్పుకొచ్చాడు. కాగా గత కొంత కాలంగా బాబర్, రిజ్వాన్ పేలవ ప్రదర్శన కనబరుస్తుండడంతో ఆసియాకప్‌కు సెలక్టర్లు చేయలేదు. సెలక్టర్ల నిర్ణయాన్ని చాలా మంది తప్పు బట్టారు. కాగా ఇటీవల కాలంలో పాక్ ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు లేకుండా ఓ మల్టీనేషనల్ టోర్నమెంట్‌లో పాల్గొంటుండడం ఇదే తొలిసారి
"ప్రస్తుతం మా జట్టు చాలా బాగుంది. గత నాలుగు సిరీస్‌లలో మేము మూడింట మేము విజయం సాధించాము. అన్ని విభాగాల్లోనూ మేము మెరుగ్గా రాణిస్తున్నాము. ఏదేమైనప్పటికి ఆసియాకప్ మాకు ఒక కఠిన సవాల్ వంటిది. ఎందుకంటే మా జట్టులో చాలా మంది ఆటగాళ్లు తొలిసారి ఒక ప్రధాన టోర్నమెంట్‌లో ఆడనున్నారు.
ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు మేము సిద్దంగా ఉన్నాము. టీ20 క్రికెట్‌లో ఏ జట్టు ఫేవరేట్ కాదు. తమదైన రోజున ప్రతీ జట్టు అద్బుతాలు చేస్తోంది. ఒకట్రెండు ఓవర్లలో మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఈ టోర్నీకి ముందు ముక్కోణపు సిరీస్‌ను మేము సన్నాహకంగా ఉపయోగించుకున్నాము.
సిరీస్‌ను గెలిచినందుకు సంతోషంగా ఉన్నాము" అని సల్మాన్ పేర్కొన్నాడు. కాగా ఈ మల్టీనేషన్ టోర్నమెంట్‌కు ముందు పాక్ జట్టు యూఏఈ, అఫ్గానిస్తాన్‌లతో ట్రైసిరీస్‌లో తలపడింది. ఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి పాక్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.
ఇప్పుడు అదే జోరును ఆసియాకప్‌లోనూ కనబరిచాలని మెన్ ఈన్ గ్రీన్ భావిస్తుంది. ఈ ఖండాంత టోర్నీలో పాక్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 12న ఒమన్‌తో తలపడనుంది. అనంతరం సెప్టెంబర్ 14న టీమిండియాతో అమీతుమీ తెల్చుకోనుంది.
పాకిస్తాన్ జట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్