‘బాంబు పేల్చిన’ పాక్‌ కెప్టెన్‌.. కీలక ప్రకటన! | Pakistan Captain Drops Bombshell Ready To Sacrifice T20I Format | Sakshi
Sakshi News home page

‘బాంబు పేల్చిన’ పాక్‌ కెప్టెన్‌.. సంచలన నిర్ణయం!

Apr 17 2026 3:40 PM | Updated on Apr 17 2026 3:59 PM

Pakistan Captain Drops Bombshell Ready To Sacrifice T20I Format

టీ20 ప్రపంచకప్‌-2026లో విఫలమైన పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘాపై మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సారథిగా, బ్యాటర్‌ అతడు పూర్తిగా విఫలం కావడమే ఇందుకు కారణం.

భారత్‌ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇవ్వగా.. తటస్థ వేదికైన శ్రీలంకలో పాక్‌ తమ మ్యాచ్‌లు ఆడిన సంగతి తెలిసిందే. భారత్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, నమీబియాలతో కలిసి గ్రూప్‌-ఎ నుంచి పోటీపడిన పాక్‌.. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడింది.

కొనసాగుతున్న వైఫల్యాలు
అయితే, పసికూనలపై ప్రతాపం చూపి సూపర్‌-8 వరకు చేరుకోగలిగింది. కానీ ఈ దశను దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ టోర్నీలో సల్మాన్‌ ఆఘా ఆరు ఇన్నింగ్స్‌ ఆడి కేవలం 60 పరుగులే చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో కరాచీ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆఘా వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.

నా ప్రదర్శన బాగాలేదు..
ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లలో కలిపి ఆఘా కేవలం 84 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌కు సుదీర్ఘ విరామం ఇవ్వనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నా ఫామ్‌ గురించి చర్చ నడుస్తోంది. వరల్డ్‌కప్‌ టోర్నీలో నా ప్రదర్శన బాగాలేదు.

పాకిస్తాన్‌ లీగ్‌లోనూ ఇదే కొనసాగుతోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇక వన్డే వరల్డ్‌కప్‌-2027 కూడా ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం నేను ఈ టోర్నీ మీదే దృష్టి సారించాలని భావిస్తున్నాను. ఈ ఏడాది డిసెంబరు దాకా టీ20 మ్యాచ్‌లు కూడా లేవు.

నా దృష్టి మొత్తం వాటి మీదే
అందుకే పీఎస్‌ఎల్‌ ముగిసిన తర్వాత వన్డే, టెస్టు ఫార్మాట్ల మీదే ఎక్కువగా దృష్టి సారిస్తాను. వన్డే ప్రపంచకప్‌ సన్నాహకాల కోసం టీ20లకు దూరంగా ఉండమన్నా ఉంటాను. నా దృష్టి ఇప్పుడు వన్డే, టెస్టుల మీదే ఉంది’’ అని సల్మాన్‌ ఆఘా చెప్పుకొచ్చాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌ వైఫల్యం తర్వాత పాకిస్తాన్‌ వన్డే సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో సల్మాన్‌ ఆఘా మెరుగ్గా రాణించాడు. మొత్తంగా 175 పరుగులు సాధించాడు.

ఇదిలా ఉంటే.. సల్మాన్‌ ఆఘా ఇప్పటి వరకు పాకిస్తాన్‌ తరఫున కేవలం 916 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 123.11 కావడం గమనార్హం. ఇక యాభై వన్డేల్లో కలిపి 1538 రన్స్‌ రాబట్టిన ఆఘా.. 23 టెస్టులాడి 1487 పరుగులు సాధించాడు. 

ఇందులో మూడు సెంచరీలు ఉండగా.. అత్యుత్తమ స్కోరు 132 నాటౌట్‌. కాగా పీఎస్‌ఎల్‌ తర్వాత పాక్‌ జట్టు మూడు టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. ఆగష్టు 19న లీడ్స్‌లో తొలి టెస్టుతో ఈ సిరీస్ మొదలయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు.

చదవండి: IND vs IRE: సూర్యకు షాక్‌..! టీమిండియా కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌?

Advertisement
 
Advertisement
Advertisement