ODI WC 2023: వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌, వేదికలు.. వివరాల వెల్లడి ఆరోజే: జై షా కీలక ప్రకటన

ODI WC Schedule Venues To Be Announced During WTC Final: Jay Shah - Sakshi

ODI World Cup 2023- Schedule and Venues: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2023 షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ సందర్భంగా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ సమయంలో వన్డే వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు జరుగనున్న వేదికలు, షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

నేరుగా అర్హత సాధించిన జట్లు
కాగా పుష్కరకాలం తర్వాత భారత్‌ వేదికగా ఐసీసీ ఈవెంట్‌ జరుగనున్న విషయం తెలిసిందే. మెగా టోర్నికి ఆతిథ్యం ఇస్తున్న భారత్‌ సహా న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్‌, సౌతాఫ్రికా నేరుగా అర్హత సాధించాయి. శ్రీలంక, వెస్టిండీస్‌ క్వాలిఫయర్స్‌లో అసోసియేట్‌ దేశాలతో పోటీ పడనున్నాయి.

క్వాలిఫయర్‌ షెడ్యూల్‌ విడుదల
జూన్‌ 18- జూలై 9 వరకు జింబాబ్వే వేదికగా ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే క్వాలిఫయింగ్‌ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. అయితే, ప్రధాన మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను త్వరలోనే విడుదలవుతుందని జై షా తాజాగా పేర్కొన్నారు.

జై షా కీలక ప్రకటన
‘‘ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌-2023 వేదికల గురించి ఐసీసీ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ సందర్భంగా నిర్ణయం తీసుకుంటాం. అదే విధంగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ వివరాలు కూడా వెల్లడిస్తాం’’ అని జై షా తెలిపారు. వేదికలకు సంబంధించి 15 స్టేడియాలను షార్ట్‌లిస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

అదే విధంగా లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు విధాన రూపకల్పనకై కమిటీ ఏర్పాలు చేయనున్నట్లు తెలిపారు. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ మొదలుకానుంది. ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో ఈ మెగా ఫైట్‌ జరుగనుంది.

మరి ఆసియా కప్‌?
ఇదిలా ఉంటే.. డోలాయమానంలో ఉన్న మరో మెగా టోర్నీ ఆసియా కప్‌-2023 నిర్వహణ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఏసీసీ సభ్యులు(టెస్టులాడే జట్లు), అసోసియేట్‌ దేశాల సభ్యులతో చర్చించిన తర్వాతే ఆసియా కప్‌-2023 భవితవ్యం తేలనుంది’’ అని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు జై షా ఈ సందర్భంగా తెలిపారు.

చదవండి: కీలక మ్యాచ్‌ల్లో రోహిత్‌ రాణించడం ఎప్పుడు చూడలేదు.. అతనో ఫెయిల్యూర్‌...!
ఐపీఎల్‌ 2023లో అతి పెద్ద సర్‌ప్రైజ్‌ ఎవరు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top