WTC Final 2023: శెభాష్‌.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే!

NZ Vs SL 1st Test: Fans Lauds Sri Lanka Fight For Last Ball Thriller - Sakshi

New Zealand vs Sri Lanka, 1st Test: న్యూజిలాండ్‌ గడ్డ మీద కివీస్‌ను ఓడించడం అంత తేలికేమీ కాదు! టీమిండియాతో ఫైనల్‌ రేసులో ముందంజ వేయాలని శ్రీలంక ఉవ్విళ్లూరుతోంది! పటిష్ట కివీస్‌ను 2-0తో వైట్‌వాష్‌ చేయడం సాధ్యమమ్యే పనేనా!? లంకేయులు మరీ ఎక్కువగా ఆశపడుతున్నారేమో! న్యూజిలాండ్‌ పర్యటన నేపథ్యంలో లంక జట్టు గురించి వినిపించిన మాటలు! 

న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించడం కఠినతరమే కానీ అసాధ్యం కాదు! లంక ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ ఒక్కడిలోనే కాదు దిముత్‌ కరుణరత్నె బృందం అందరిలోనూ అదే ఆత్మవిశ్వాసం.. 

అందుకు తగ్గట్లే తొలి టెస్టులో కివీస్‌ను అల్లల్లాడించింది శ్రీలంక జట్టు.. ఆఖరి బంతి వరకు అసాధారణ పోరాటం కనబరిచింది.. అయితే, అదృష్టం మాత్రం కివీస్‌ వైపు ఉంది. కేన్‌ విలియమ్సన్‌ అద్భుత డైవ్‌తో నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చివరి బంతికి న్యూజిలాండ్‌కు విజయం అందించాడు.

ఆశలు ఆవిరి
దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలవాలన్న లంక ఆశలు ఆవిరైపోయాయి. వెరసి ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023లో ఆఖరి టెస్టు ఫలితం తేలకముందే టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అభిమానులు భారత జట్టుకు శుభాకాంక్షలు చెబుతూనే శ్రీలంక అద్భుత పోరాటాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.  

ఓడించినంత పనిచేశారు
‘‘దేశం తీవ్ర సంక్షోభంలో మునిగిపోయిన వేళ ధైర్యంగా ముందడుగు వేసి ఆసియా కప్‌ గెలిచారు. ఇప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరేందుకు న్యూజిలాండ్‌ గడ్డపై అసాధారణ పోరాటం చేశారు. కివీస్‌తో తొలి టెస్టులో తృటిలో గెలుపు చేజారింది. అంతమాత్రాన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆటలో గెలుపోటములు సహజం.

విజయం కోసం ఆఖరి బంతి వరకు మీరు పోరాడిన తీరు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టెస్టు క్రికెట్‌లో అసలైన మజా అందించారు’’ అంటూ లంక ఆటగాళ్లను కొనియాడుతున్నారు. ‘‘ఓడినా మనసులు గెలిచారు.. మరేం పర్లేదు’’ అంటూ నిరాశలో మునిగిపోయిన కరుణరత్నె బృందానికి సోషల్‌ మీడియా వేదికగా సానుభూతి ప్రకటిస్తున్నారు.

కేన్‌ మామ వల్లే
కాగా మార్చి 9-13 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక న్యూజిలాండ్‌ చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. లంక తొలి ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ కుశాల్‌ మెండిస్‌ 87 పరుగులతో రాణించగా..  రెండో ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్‌ సెంచరీతో మెరిశాడు.

ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడిన వేళ న్యూజిలాండ్‌ మాజీ సారథి కేన్‌ విలియమ్సన్‌ 121 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆటను ఐదో రోజు వరకు తీసుకువచ్చిన మరో సెంచరీ వీరుడు డారిల్‌ మిచెల్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మార్చి 17 నుంచి రెండో టెస్టు ఆరంభం కానుంది.

చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్‌! అశ్విన్‌కూ సాధ్యం కానిది..
Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్‌ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్‌ మామ
BGT 2023: గత నాలుగు సిరీస్‌ల్లో ఆసీస్‌కు ఇదే గతి..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top