BGT 2023: గత నాలుగు సిరీస్‌ల్లో ఆసీస్‌కు ఇదే గతి..!

India Beat Australia With Same Lead In Last Four BGT Series - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్‌ పేలవ డ్రాగా ముగిసింది. ఆట ఆఖరి రోజు వికెట్ల వర్షం కురిసి, మ్యాచ్‌ భారత్‌వైపు మొగ్గు చూపుతుందని అంతా ఊహించినప్పటికీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చి నిరుత్సాహపరిచింది.

మ్యాచ్‌ లాస్ట్‌ సెషన్‌ వరకు ఆసీస్‌ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోగా.. భారత బౌలర్లు జీవం లేని పిచ్‌పై బౌలింగ్‌ చేసి అలిసి సొలసి నీరసించారు. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్‌ హెడ్‌ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్‌ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. 

అంతకుముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్‌ కాగా.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్‌ ఖ్వాజా (180), గ్రీన్‌ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (128), విరాట్‌ కోహ్లి (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్‌ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023ని భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.

కాగా, ఇక్కడ ఓ ఆసక్తికర విశేషమేమింటంటే.. భారత్‌ గత నాలుగు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలను ఇదే మార్జిన్‌తో కైవసం చేసుకుంటూ వచ్చింది. 2017లో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్‌కు మట్టికరిపించిన భారత్‌.. ఆతర్వాత 2018-19 సిరీస్‌లో, 2020-21 సిరీస్‌లో, తాజాగా BGT-2023లో ఆసీస్‌ను అదే 2-1 తేడాతో ఓడించి, ఆసక్తికర గణాంకాలను నమోదు చేసింది.

ఈ అసక్తికర విషయాలతో పాటు భారత్‌ ఓ చెత్త రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో గడిచిన 10 ఏళ్లలో టీమిండియా తొలిసారి వరుసగా రెండు టెస్ట్‌ల్లో విజయం లేకుండా (తొలి రెండు టెస్ట్‌లో భారత్‌ విజయం, మూడో టెస్ట్‌లో 9 వికెట్ల తేడాతో ఆసీస్‌ విజయం, నాలుగో టెస్ట్‌ డ్రా) సిరీస్‌ను ముగించింది.  

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top