పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జ‌ట్టుతో డేంజ‌ర్‌? | Asia Cup 2025: Team India Crushes Pakistan, Eyes Clash With Sri Lanka in Super-4 | Sakshi
Sakshi News home page

Asia Cup 2025: పాకిస్తాన్ కాదు.. టీమిండియాకు ఆ జ‌ట్టుతో డేంజ‌ర్‌?

Sep 15 2025 1:03 PM | Updated on Sep 15 2025 2:29 PM

Not Pakistan,Why Sri Lanka Could Be India's Biggest Threat In Asia Cup 2025

ఆసియాక‌ప్‌-2025లో టీమిండియా జోరు కొన‌సాగుతోంది. తొలి మ్యాచ్‌లో యూఏఈను చిత్తు చేసిన భార‌త జ‌ట్టు.. ఇప్పుడు రెండో మ్యాచ్‌లో చిర‌కాల ప్ర‌త్య‌ర్ధి పాకిస్తాన్‌పై అదే ఫ‌లితాన్ని పున‌రావృతం చేసింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ విజయభేరి మ్రోగించింది.

వరుసగా రెండు విజయాలతో గ్రూపు-ఎ నుంచి టేబుల్ టాపర్‌గా భారత్ నిలిచింది. భారత్‌కు ఇంకా ఒకే ఒక లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. సెప్టెంబర్ 19న పసికూన ఒమన్‌తో సూర్య కుమార్ సేన తలపడనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం నల్లేరు మీద నడక అనే చెప్పుకోవాలి.

ఇప్పటికే పాక్‌పై  విజయంతో మెన్ ఇన్ బ్లూ సూపర్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. గ్రూపు-ఎ టేబుల్ టాపర్‌గా ఉన్న భారత్ సూపర్-4 రౌండ్ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 21న ఏ2తో తలపడనుంది. అంటే దాదాపు మళ్లీ  పాక్‌-భారత్ జట్లు సూపర్ ఫోర్ దశలో తలపడే అవకాశముం‍ది.  

శ్రీలంకతో జాగ్రత్త.. 
అయితే ఈ టోర్నీలో భారత్ అద్బుతమైన విజయాలతో దూసుకెళ్లుతున్నప్పటికి డిఫిండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో ముప్పు పొంచి ఉంది. ఆ తర్వాత అఫ్గానిస్తాన్ ఎంతో కొంత పోటీ ఎదురయ్యే అవకాశముంది. పాక్‌, బంగ్లాదేశ్ వంటి ప్రధాన జట్లు పోటీపడుతున్నప్పటికి.. ఆ టీమ్స్ తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి.

ముఖ్యంగా శ్రీలంకను టీమిండయిఆ ఏ మాత్రం తేలికగా తీసుకుంటే భారీ మూల్యం చెల్లంచుకోక తప్పదు. శ్రీలంక ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా బౌలింగ్‌లో సూపర్ స్టార్లు ఉన్నారు. ఈ టోర్నీలో అన్ని జట్లకు భిన్నంగా శ్రీలంక ముగ్గురు పేస్ బౌలర్లతో తమ తొలి మ్యాచ్‌లో ఆడింది. 

దుష్మాంత చమీరా, మతీషా పతిరానా, నువాన్ తుషారా వంటి పేస్ త్రయం శ్రీలంక వద్ద ఉంది. పవర్‌ప్లేలో తుషారా తన సంచలన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను కట్టడి చేయగలడు. స్పిన్ బౌలింగ్ విభాగంలో వరల్డ్ క్లాస్ వనిందు హసరంగా ఉన్నాడు.

ఐపీఎల్‌లో ఆడిన అనుభవం హసరంగా ఉండడంతో భారత బ్యాటర్ల వీక్‌నెస్ అతడికి బాగా తెలుసు. అంతేకాకుండా ఐపీఎల్ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడిన కమిందు మెండిస్ సైతం లంక జట్టులో భాగంగా ఉన్నాడు. అతడి కూడా బంతిని గింగరాలు తిప్పగలడు.

బ్యాటింగ్ విషయానికి వస్తే  కుశాల్ మెండిస్‌, నిస్సాంక, కుశాల్ పెరీరా, కెప్టెన్ చరిత్ అసలంక వంటి హిట్టర్లతో శ్రీలంక పటిష్టంగా ఉంది. యువ ఆటగాడు కమిల్ మిశ్రా సైతం మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై మిశ్రా 46 పరగులతో సత్తాచాటగా.. నిస్సాంక హాఫ్ సెంచరీతో రాణించాడు.

శ్రీలంక కూడా టీమిండియా మాదిరిగానే అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఒకవేళ శ్రీలంక గ్రూపు-బి టేబుల్ టాపర్‌గా కొనసాగితే.. సూపర్‌-4 రౌండ్‌లో భారత్‌తో సెప్టెంబర్ 26న తలపడనుంది. కాగా చివరసారిగా టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియాకప్‌(2022)ను శ్రీలంకనే సొంతం చేసుకుంది.

అత్య‌ధిక ఆసియాక‌ప్ టైటిల్స్ గెలుచుకున్న జ‌ట్టుగా భార‌త్ త‌ర్వాత శ్రీలంక‌నే కొన‌సాగుతోంది. టీమిండియా అత్య‌ధికంగా 8 సార్లు ఈ మెగా టోర్నీ విజేత‌గా నిల‌వ‌గా.. లంక 6 సార్లు ఛాంపియ‌న్‌గా నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement