ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు భారీ షాక్ తగిలింది. ఐదు టీ20ల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ గాయం కారణంగా దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది. అడిలైడ్‌లో ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో నితీష్‌కు ఎడమ తొడ కండరాల (క్వాడ్రిసెప్స్) గాయం అయింది.
దీంతో అతను సిడ్నీలో జరిగిన మూడో వన్డేకు దూరంగా ఉన్నాడు. అయితే టీ20 సిరీస్ సమయానికి ఈ ఆంధ్ర క్రికెటర్ కోలుకుంటాడని అంతా భావించారు. కానీ క్వాడ్రిసెప్స్ గాయం నుంచి కోలుకునే క్రమంలో అతడికి మెడకు (స్పాసమ్స్) సమస్య కూడా తలెత్తింది. దీంతో అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి వారం రోజుల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో కూడా ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే గాయం కారణంగా నితీశ్ స్వదేశానికి వచ్చేశాడు.
కాగా కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్ నితీశ్ గైర్హజరీలో శివమ్ దూబే, హర్షిత్ రాణా వంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే తొలి టీ20కు వర్షం పదే పదే అంతరాయం కలిగిస్తోంది. 9.4 ఓవర్ల వద్ద వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. భారత్ స్కోర్ 97-1గా ఉంది.
తుదిజట్లు:
టీమిండియా
అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టొయినిస్, జోష్ ఫిలిప్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్.


