
సొంతగడ్డపై ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం ప్రారంభమైన తొలి టెస్టులో పాక్ 378 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 313/5 ఓవర్ నైట్ స్కోర్‌తో అదనంగా 65 పరుగులు సాధించి ఆలౌటైంది. ఓ దశలో పాకిస్తాన్ నాలుగు వందలకు పైగా సాధిస్తుందని భావించారు.
కానీ స్పిన్నర్ ముత్తుసామి దెబ్బకు ఆతిథ్య జట్టు ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను త్వరగా ముగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. అతడి స్పిన్ దాటికి పాక్ ఆఖరిలో వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.
పాక్ బ్యాటర్లలో ఇమామ్ ఉల్ హక్ (153 బంతుల్లో 93; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ షాన్ మసూద్ (147 బంతుల్లో 76; 9 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (140 బంతుల్లో 75; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సల్మాన్ ఆఘా (145 బంతుల్లో 93 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో రాణించారు.
ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్ (2) విఫలం కాగా... ఇమామ్‌తో కలిసి షాన్ మసూద్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ జంట రెండో వికెట్‌కు 161 పరుగులు జోడించడంతో పాకిస్తాన్‌కు శుభారంభం దక్కింది. రెండేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న ఇమామ్... చక్కటి షాట్ సెలెక్షన్‌తో ఆకట్టుకున్నాడు. అయితే షాన్ మసూద్ అవుటైన అనంతరం ఒకే స్కోరు వద్ద పాకిస్తాన్ మూడు వికెట్లు కోల్పోయింది.
199 పరుగుల వద్ద ఇమామ్ ఉల్ హక్‌తో పాటు సౌద్ షకీల్ (0), బాబర్ ఆజమ్ (23) వెనుదిరిగారు. దీంతో పాక్ జట్టు 199/5తో కష్టాల్లో పడింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా... హర్మెర్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో ప్రత్యర్ధి పైచేయి సాధించే అవకాశం ఇవ్వకుండా వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ ఆఘా మెరుగ్గా ఆడారు.
చదవండి: భర్తేమో బ్యాటర్ల పాలిట విలన్.. భార్యేమో బౌలర్లకు హడల్! ఆ జంట ఎవరో తెలుసా?